
ఉన్నత విద్యకు ఊతం
గంభీరావుపేటలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల
గంభీరావుపేట(సిరిసిల్ల): పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మెరుగైన వసతుల కల్పన.. బోధన సిబ్బంది కొరత లేకుండా చూస్తుంది. ఇందులో భాగంగా గంభీరావుపేట కేజీ టు పీజీ విద్యాలయంలో వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం శ్రీపీఎం ఉష పథకంశ్రీ(ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్ష అభియాన్) కింద గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు రూ.5కోట్లు మంజూరు చేసింది. కళాశాలలో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గదుల కొరత ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం మంజూరైన నిధులతో నూతన తరగతి గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో గదుల కొరత తీరనుంది. తరగతి గదులు, ల్యాబ్‌లు తదితర విభాగాల్లో అభివృద్ధి పనులు జరిగి బోధన సౌకర్యాలు మెరుగుపడే మార్గం సుగమమైంది.
పెరుగుతున్న విద్యార్థులు
గంభీరావుపేట డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వివిధ విభాగాల్లో సుమారు 900 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఓపెన్ యూనివర్సిటీ విభాగంలో మరో 600 మంది చదువుతున్నారు. ఈక్రమంలో పాత భవనంలో తరగతి గదులు, బోధన సామగ్రి సరిపోవడం లేదు. ల్యాబ్‌లలో సైతం బోధన తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాల శ్రేణి పెంపునకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల అభివృద్ధికి బలమైన బూస్ట్ లభించినట్లయిందని అభిప్రాయపడుతున్నారు.
గదుల నిర్మాణానికి రూ.4.30 కోట్లు
ప్రస్తుతం ఉన్న భవన సముదాయంపై జీప్లస్ వన్‌గా కొత్తగా మరో భవన సముదాయం నిర్మించనున్నారు. పీజీ కళాశాల విద్యార్థుల బోధన కోసం నాలుగు తరగతి గదులు, కాన్ఫరెన్స్‌ల నిర్వహణకు సెమినార్ హాల్ నిర్మించడానికి రూ.4.30 కోట్లు వెచ్చించనున్నారు. పనులు సైతం ప్రారంభమయ్యాయి.
బోధన సామగ్రికి రూ.70లక్షలు
డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బోధన సామగ్రి సమకూర్చడానికి రూ.70లక్షలు మంజూరయ్యాయి. వీటితో కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, ల్యాబ్ సామగ్రి కొనుగోలు చేయనున్నారు. కళాశాలలో సాంకేతికత, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఈ–లెర్నింగ్ వంటి సాధనాలను ఏర్పాటు చేయనున్నారు.
గంభీరావుపేట డిగ్రీ కళాశాల అభివృద్ధికి రూ.5కోట్లు
తీరనున్న గదుల కొరత
పెరుగనున్న బోధన సిబ్బంది
దరిచేరనున్న వసతులు
కొత్త కోర్సులు ప్రారంభిస్తాం
కొత్తగా వృత్తి నైపుణ్య కోర్సులు, పీజీ కోర్సులు ప్రారంభిస్తాం. నిధుల మంజూరుతో ఇవి ప్రారంభించడానికి అవకాశం ఏర్పడింది. అదే విధంగా తరగతి గదుల సమస్య తీరనుంది. కాన్ఫరెన్స్‌లు నిర్వహించడానికి ప్రస్తుతం చాలా కష్టంగా ఉంది. సెమినార్ హాల్ పూర్తయితే సమస్య తీరుతుంది.
– ప్రొఫెసర్ విజయలక్ష్మి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల

ఉన్నత విద్యకు ఊతం