
ఆలయ అభివృద్ధి పనులు మొదలుపెట్టాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
వేములవాడఅర్బన్: అంజన్న ఆలయంలో అభివృద్ధి పనులు మొదలుపెట్టాలని అధికారులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారంలోని హనుమాన్ ఆలయం వద్ద రూ.31లక్షలతో ఆర్చి, ప్రాకారం, కమాన్ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశారు. కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఆలయ ఈవో శ్రీనివాస్‌కు, అధికారులకు పలు సూచనలు చేశారు. సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారి మధ్య నుంచి 50 ఫీట్ల దూరం నుంచి ఆర్చి, ప్రాకారం సాలహారంతో కలిసి కమాన్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. టెండర్ ప్రక్రియ ఇటీవల పూర్తయిందని వెల్లడించారు.
ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు
కోనరావుపేట(వేములవాడ): ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హెచ్చరించారు. కో నరావుపేటలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం, గౌరీశంకర్ ఫర్టిలైజర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాములలో మంగళవారం తనిఖీ చేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉండాలని సూచించారు. యూరియాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి వివరించాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.
స్వశక్తి మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాలు ఏర్పాటు చేసుకున్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆకాంక్షించారు. ఇందిరా మహిళాశక్తి కింద మర్తనపేటలో విశ్వదర్శనీ గ్రామ సమైక్య ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం కొలనూర్‌లో కలకుంట రమణ నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. త్వరగా పూర్తి చేసుకుంటుండడంపై అభినందించారు. బేస్‌మెంట్, రూఫ్‌లెవల్ కింద ఇప్పటికే రూ.2లక్షలు జమయ్యాయని, ఆర్‌సీ లెవల్ పూర్తయినందున చివరి బిల్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. తన భర్తకు కంటి సమస్య ఉందని, ఆదుకోవాలని రమణ కోరగా సిరిసిల్లలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్యం చేయించాలని అధికారులకు సూచించారు. డీఆర్డీవో శేషాద్రి, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్లపెల్లి ప్రభాకర్, మాజీ సర్పంచ్ వెన్నమనేని వంశీకృష్ణారావు పాల్గొన్నారు.
11 నుంచి నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
సిరిసిల్లకల్చరల్: జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. 19 ఏళ్లలోపు పిల్లలతోపాటు వివిధ విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఈనెల 11న ఆల్బెండజోల్ మాత్రలు అందజేయాలని సూచించారు. ఈనెల 18న ముగింపు రోజున ఇంటింటికి వెళ్లి మాత్రలు అందజేయాలన్నారు. డీఎంహెచ్‌వో రజిత, వేములవాడ ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ పెంచలయ్య, విద్యాధికారి వినోద్‌కుమార్, సంక్షేమాధికారి లక్ష్మీరాజం, డీపీఆర్‌వో శ్రీధర్, డీపీవో షరీఫొద్దీన్ పాల్గొన్నారు.