
చిక్కితే చిలుము వదులుతోంది!
● అక్రమ మైనింగ్‌పై అధికారుల ఉక్కుపాదం ● వాహనాలపై కేసులు.. జరిమానాలు ● నిఘా పెట్టి.. కట్టడి చేస్తున్న అధికారులు ● అయినా మారని అక్రమార్కులు
సిరిసిల్ల: జిల్లాలో అక్రమంగా సాగుతున్న మైనింగ్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గతానికి భిన్నంగా జిల్లాలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేస్తున్నారు. రాత్రి వేళల్లోనూ దాడులు చేస్తూ అక్రమార్కులను కట్టడి చేస్తున్నారు. వేములవాడ అర్బన్ మండలం పరిధిలో గుట్టల్లో రాత్రి వేళల్లో ‘పుష్ప’ సినిమా తరహాలో భారీ ఎత్తున టిప్పర్లు, ట్రాక్టర్లలో జేసీబీలతో మట్టి, మొరం నింపుతూ.. అక్రమ రవాణాకు తెరలేపారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సిరిసిల్ల టాస్క్‌ఫోర్స్ సీఐ నటేశ్ ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు దాడి చేసి అక్రమ మైనింగ్ గుట్టును రట్టు చేశారు. భారీ ఎత్తున వాహనాలు పట్టుబడ్డాయి. జిల్లా వ్యాప్తంగా సహజ వనరులు ధ్వంసమైపోతుంటే కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గీతే ఆదేశాలతో అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు.
నిబంధనల మేరకు అనుమతులు
జిల్లాలో ప్రభుత్వ పథకాలకు, నిర్మాణాలకు నిబంధనల మేరకు పరిమితుల్లో అనుమతులు ఇస్తున్నా రు. మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతులతో రవాణా జరగాల్సి ఉండగా.. అనుమతులు లేని మ ట్టి, మొరం దందా సాగుతోంది. విచ్చలవిడిగా సాగే అక్రమ దందాను కట్టడి చేసే లక్ష్యంతో జిల్లా అధి కారులు అక్రమమైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటుంది. సెలవు రోజుల్లో అనుమతులు ఇవ్వవద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు పని దినాల్లోనే రవాణాకు అనుమతులు ఇస్తున్నారు.
ఎక్కడికక్కడే పట్టివేత
● జూన్ 28న ఇందిరమ్మ ఇళ్లకు అని వాహనాలకు బ్యానర్ కట్టి వేములవాడ రూరల్ మండలంలోని కొడిముంజ–అనుపురం పరిసరాల్లో అక్రమ రవాణా చేస్తున్న 10 టిప్పర్లు, రెండు ట్రాక్టర్లు, రెండు జేపీబీలు, రెండు హిటాచి యంత్రాలను పట్టుకున్నారు.
● జూలై 21న ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో హిటాచి యంత్రాన్ని పట్టుకున్నారు.
● 12న ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో జేసీబీ, ఐదు ట్రాక్టర్లను సీజ్ చేశారు.
● 10న ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో జేసీబీ, ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నారు.
● జూలై 22న ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో హిటాచీ, జేసీబీ, ఒక్క టిప్పర్‌ను సీజ్ చేసి ఎస్పీ ఆఫీస్‌కు తరలించారు.
జంకని అక్రమార్కులు
అనుమతి లేకుండా మొరం, మట్టి తరలిస్తున్న 691 వాహనాలను మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. వాహనాలను సీజ్ చేసి నెలల తరబడి విడుదల చేయకుండా కట్టడి చేస్తేనే అక్రమార్కులు ఆర్థికంగా నష్టపోయి, వాహనాలు చెడిపోయి ఇబ్బందులు పడుతున్నారు. కానీ అధికారులు విధించిన జరిమానాలకు జంకడం లేదు. జిల్లాలో అక్రమార్కులకు గతంలో రూ.1,02,026 మేరకు జరిమానా విధించారు. మరో సందర్భంలో నలుగురు అక్రమార్కులకు రూ.2,87,515 జరిమానా విధించి ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. అయినా అక్రమార్కుల్లో మార్పు రాకపోవడంతో వాహనాలను సీజ్ చేస్తున్నారు.
ఇవీ సీజ్ చేయబడిన వాహనాలు. వీటిని ఎస్పీ ఆఫీస్ ఆవరణలో ఉంచారు. ట్రాక్టర్లు, జేసీబీలు, టిప్పర్లు, వ్యాన్లు ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇటీవల పట్టుకుని సీజ్ చేశారు. అక్రమంగా మట్టి, మొరం తరలిస్తే జరిమానాలు విధించకుండా వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాలు సైతం నెలల తరబడి విడుదల కావడం లేదు. ఎస్పీ ఆఫీస్, ఠాణాల్లో ఉంటున్న వాహనాల టైర్లలో గాలిపోయి, చిలుముపడుతున్నాయి.
ఎవరిని వదిలిపెట్టం
అనుమతి లేకుండా మైనింగ్‌కు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టేది లేదు. అనుమతి తీసుకుని మట్టి, మొరం, ఇసుక తరలించాలి. కానీ సెలవు రోజుల్లో, రాత్రి వేళల్లో అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఇందిరమ్మ ఇళ్లకు అని బ్యానర్ కట్టి అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాం. అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా అక్రమ మైనింగ్ నిరోధానికి చర్యలు తీసుకుంటుంది. అనుమతులు లేకుంటే సీజ్ చేస్తాం.
– సందీప్‌కుమార్ ఝా, కలెక్టర్
ఇది వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం వద్ద గుట్ట నుంచి అక్రమంగా మొరం తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడిన ట్రాక్టర్లు. ఇక్కడ అనుమతి లేకుండానే జేసీబీతో మొరం నింపుతూ తరలిస్తున్నారు. పోలీసులు ఈ సమాచారం అందుకుని గుట్టల్లో సాగుతున్న అక్రమదందాను అడ్డుకున్నారు. వాహనాలను సీజ్ చేసి, మొరం రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.

చిక్కితే చిలుము వదులుతోంది!

చిక్కితే చిలుము వదులుతోంది!