
సమస్యలు పరిష్కరించండి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● ప్రజావాణిలో 189 దరఖాస్తుల స్వీకరణ
సిరిసిల్ల అర్బన్: ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 189 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని సూచించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మపూర్‌కు చెందిన కొలకాని శంకరయ్య, లస్మయ్య ఇద్దరు అన్నదమ్ములకు చెందిన 28 గంటల వారసత్వ భూమిని లస్మయ్య కొడుకు రవి..శంకరయ్యకు తెలియకుండా 2016లో ధరణిలో పట్టా చేసుకున్నాడు. దీంతో శంకరయ్య గతేడాది కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారసత్వ భూమిపై విచారణ చేసి ఇద్దరికీ సమానంగా పంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదికను సిరిసిల్ల ఆర్డీవోకు పంపగా అక్కడ పెండింగ్‌లో ఉంది. ఈక్రమంలో తన భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌కు సోమవారం ప్రజావాణిలో శంకరయ్య ఫిర్యాదు చేయగా వెంటనే సిరిసిల్ల ఆర్డీవోను పిలిచి తాను ఆదేశించినా భూ సమస్యను పరిష్కరించరా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీగలను తొలగించాలి
మాది వేములవాడ రూరల్ మండలం మల్లారం. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నా సొంత స్థలంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించగా పై నుంచి హైటెన్షన్ కరెంట్ తీగలు వెళ్తుండడంతో ఇంటి నిర్మాణం నిలిచిపోయింది. నా ఇంటిపైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లను తొలగించి నాకు న్యాయం చేయండి.
– మారుమొకం దేవరాజు, మల్లారం
సారూ పెన్షన్ ఇప్పించరూ..
నాకు చీమకుట్టి కాలుకు పుండుగా మారి ఇన్‌ఫెక్షన్ అయింది. ఫలితంగా నా ఎడమ కాలు మోకాలు వరకు తొలగించారు. సొంతిల్లు లేక అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. సంవత్సరం నుంచి పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నాను. ఇప్పటికై నా నాకు పెన్షన్ ఇప్పించి నా కుటుంబాన్ని ఆదుకోవాలి.
– అడ్డగట్ల పద్మ, సాయినగర్, సిరిసిల్ల

సమస్యలు పరిష్కరించండి

సమస్యలు పరిష్కరించండి