
డుమ్మాలకు చెక్ పడేనా !
● ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరుకు కొత్త సాఫ్ట్‌వేర్ ● ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ఇష్టారీతి సెలవులకు స్వస్తి ● మూడేళ్ల క్రితం విద్యార్థులకు.. ఇప్పుడు టీచర్లకు అమలు
సిరిసిల్ల ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం.. నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సన్నబియ్యం మధ్యాహ్నభోజనం.. ఉచిత పుస్తకా లు.. నోట్‌బుక్స్ అందిస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మూడేళ్ల క్రితం విద్యార్థుల హాజరును ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టగా.. తాజాగా టీచర్ల హాజరును సైతం ఆన్‌లైన్ విధానం ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేజ్ రికగ్నిషియన్ సిస్టమ్)ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా సమయానికి స్కూల్‌కు రావడంతోపాటు సమయం ముగిసే వరకు పాఠశాలలోనే ఉండాల్సి ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందనుందని ప్రభుత్వం భావిస్తోంది.
511 స్కూళ్లలో..
జిల్లాలోని 511 స్కూళ్లలో 39,087 మంది విద్యార్థులకు, 2,312 మంది ఉపాధ్యాయులకు ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ విధానం అమలులో ఉంది. దీని ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పక్కాగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది ఫిబ్రవరి నుంచి పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును అమలు చేస్తున్నారు. అక్కడ విజ యవంతం కావడంతో జిల్లాలో రెండు రోజుల నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్‌స్కూల్స్, యూఆర్‌ఎస్, టీజీఆర్‌ఈఐఎస్‌లలో అమలు చేస్తున్నారు.
డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ద్వారా..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు తీసుకుంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్) యాప్‌ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్ ద్వారా హెచ్‌ఎంలు, టీచర్లు, నాన్‌టీచింగ్ ఉద్యోగుల హాజరు అమలు చేస్తున్నారు. హెచ్‌ఎంలు తమ సెల్‌ఫోన్‌లోని డీఎస్‌ఈ యాప్‌లో టీ చింగ్ మాడ్యుల్ టీచర్స్, నాన్‌టీచింగ్ మాడ్యుల్‌లో నాన్‌టీచింగ్ సిబ్బందిని రిజిస్ట్రేషన్ చేయాలి. ఫొటో తీసి వారి వివరాలు, పాఠశాల సమయం అప్‌లోడ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది తమ సెల్‌ఫోన్లలో సంబంధిత యాప్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ తీసుకోవచ్చు. పాఠశాల ఆవరణలో ఉండి హాజరువేసేలా జియోట్యాగింగ్ చేశారు. సెలవు పెడితే తప్పనిసరిగా యా ప్‌లో రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించిన సమయానుసారంగానే ఈ యాప్‌లో హాజరు నమోదు చేసుకోవచ్చు.
హాజరుపై రోజువారీ సమీక్ష
ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్‌ను జిల్లా విద్యాధికారితోపాటు కలెక్టర్ ప్రతీరోజు సమీక్ష చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కలెక్టర్ ప్రతిరోజు ఏదో ఒక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పుడు టీచర్ల ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును పర్యవేక్షించే అవకాశం మెండుగా ఉన్నాయని ఏదైనా తప్పు జరిగితే అప్పటికప్పుడే చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. డీఈవో కార్యాలయాల్లో డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల పనివేళలు
ప్రాథమిక పాఠశాలలు
ఉదయం 9 నుంచి
సాయంత్రం 4 గంటల వరకు
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు
ఉదయం 9 నుంచి సాయంత్రం
4.15 గంటల వరకు

డుమ్మాలకు చెక్ పడేనా !