
వాహనాల రాకపోకలపై నియంత్రణ
సిరిసిల్ల: కలెక్టరేట్‌లో వాహనాల రాకపోకలపై నియంత్రణ, నిఘా ఏర్పాటు చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా చొరవతో సెక్రటేరియట్ తరహాలో కలెక్టరేట్‌లో వాహనాల రాకపోకలు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్‌లోని వచ్చే ప్రతీ వాహనం నంబరును ప్రవేశద్వారం వద్దనే సెక్యూరిటీ సిబ్బంది బుక్‌లో నమోదు చేస్తారు. వారు అనుమతి ఇస్తూ ప్రధాన బారీకేడ్‌ను తెరిస్తేనే వాహనం కలెక్టరేట్‌లోకి ప్రవేశిస్తుంది. సెక్యూరిటీ సిబ్బంది బారీకేడ్లను తిరిస్తేనే వాహనాలు లోనికి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు వీలవుతుంది.
సెల్లార్‌లో పార్కింగ్
గతంలో సెల్లార్‌లోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు మూడు మార్గాలు ఉండేవి. నేరుగా వాహనాలు లోనికి వెళ్లి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పార్కింగ్ చేసేవారు. కానీ ఇప్పుడు లోనికి వెళ్లేందుకు ఉండే రెండు మార్గాలను మూసివేశారు. ఒకే మార్గం ద్వారా లోనికి వాహనాలను అనుమతిస్తున్నారు. అదీ కూడా ఐరన్ గేటును ఏర్పాటు చేశారు. ఐరన్ గేటు మూసి వేస్తే లోనికి వెళ్లేందుకు వీలు లేదు. బయటకు వచ్చే మూడు మార్గాల్లో రెండింటిని మూసివేసి, ఒకే మార్గాన్ని ఐరన్ గేటుతో కట్టడి చేశారు. సెల్లార్‌లో ద్విచక్రవాహనాలు, కార్ల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు కేటాయించారు.
అధికారుల వాహనాలకు క్యూఆర్ కోడ్
కలెక్టరేట్‌లోకి నిత్యం వెళ్లే అధికారుల వాహనాలకు క్యూఆర్ బార్ కోడింగ్‌తో కూడిన స్టిక్కర్లను జారీ చేయనున్నట్లు సమాచారం. అధికారుల వాహనాలు రాగానే ప్రధాన గేటు వద్దనే ఆటోమేటిక్‌గా స్కానింగ్ చేసి బారీకేడ్ తెరుచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజిటర్స్ వాహనాలపై నిఘా, నియంత్రణ ఉంటుందని తెలుస్తోంది. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్‌లకు ఒకే మార్గం ఉండడంతో కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. జిల్లా అధికారుల వాహనాల రాకపోకలు, ఉద్యోగుల వాహనాల రాకపోకలు, విజిటర్స్ వాహనాలపై పక్కాగా నిఘా ఉండేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేని విధంగా సచివాలయం తరహాలో కలెక్టరేట్‌లో ప్రత్యేకమైన రక్షణ ఏర్పాట్లు చేయడం విశేషం.
కార్లు, బైక్‌ల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం
అధికారుల వాహనాలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు
కలెక్టరేట్‌లో పటిష్ట ఏర్పాట్లు

వాహనాల రాకపోకలపై నియంత్రణ