
కార్తెలు కరిగిపోతున్నాయ్
● ఎగువమానేరు నిండేదెన్నడో.. ● ఆకాశం వైపు అన్నదాతల చూపు ● ఆగస్టుపైనే ఆశలు
గంభీరావుపేట(సిరిసిల్ల): కార్తెలు కరిగిపోతున్నాయి. వర్షాలు కురవడం లేదు. కాలం కలిసిరావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం కమ్ముకుంటున్న మేఘాలు వర్షించకపోవడంతో రైతులు నైరాశ్యంలో మునిగిపోయారు. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అప్పుడప్పుడు వానలు కురుస్తున్నా వరదలు రాక చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి నీరు చేరడం లేదు. బావులు, బోర్లు ఆధారంగా కొంతమంది రైతులు పొలాలను దున్ని నాటువేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎలాంటి నీటి ఆధారం లేని రైతులు మిన్నకుండిపోతున్నారు. వర్షాలు లేకపోతే బావులు, బోర్లు కూడా ఇంకిపోయి పంటలు ఎండిపోతాయేమోనని భయాందోళన చెందుతున్నారు. ఆగస్టులోనైనా వర్సాలు కురుస్తాయేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
వరప్రదాయిని ఎగువమానేరు
గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాలకు నర్మాల ఎగువమానేరు ప్రధాన ఆధారం. దీనిపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు వర్షాలు అంతంతే కురిశాయి. వచ్చే నెలరోజుల్లో ప్రాజెక్టు నిండితేనే పంటల సాగుకు ఢోకా ఉండదని భావిస్తున్నారు. లేకపోతే వానాకాలం సాగు లేనట్టేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 31 అడుగులు కాగా ప్రస్తుతం 20 అడుగుల నీరు మాత్రమే ఉంది. రెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల జలాశయంలో ప్రస్తుతం ఒక టీఎంసీ మాత్రమే ఉంది. ఎగువ ప్రాంతాలైన కూడవెల్లి, పాల్వంచవాగుల నుంచి వరద రావడం లేదు. గతంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా కాళేశ్వరం జలాలు వచ్చాయి. దీంతో ప్రాజెక్టు జలకళతో ఉండేది. కానీ ఈసారి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోనూ నీరు లేదు.