
మట్టి అక్రమ రవాణాపై కఠిన చర్యలు
● అనుమతి లేకుండా తరలించవద్దు ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో మట్టి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల బ్యానర్‌లో సెలవు రోజుల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని వివరించారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి తరలిస్తే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. వేములవాడ అర్బన్ మండలం శాత్రాజుపల్లిలో అక్రమ మట్టి తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఇన్‌చార్జి ఆర్డీవో రాధాబాయి సీజ్ చేశారని ఆయన వివరించారు. క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్న ఆర్డీవోను కలెక్టర్ అభినందించారు. ఇందిరమ్మ ఇండ్లకు పనిదినాలలో ప్రభుత్వం ఇసుక, మట్టి తరలించేందుకు అనుమతులు ఇచ్చిందని, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అక్రమ మట్టి రవాణా జరుగుతోందని సమాచారంతో క్షేత్రస్థాయిలో ఆదివారం తనిఖీలు నిర్వహించగా.. నాలుగు ట్రాక్టర్లు, ఒక్క జేసీబీ పరారయ్యాయని ఇన్‌చార్జి ఆర్డీవో రాధాబాయి తెలిపారు. జిల్లాలో అక్రమంగా ఇసుక, మట్టి రవాణా ఎవరు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.