
రెండు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
సిరిసిల్ల: జిల్లాలో ఈ ఏడాది రెండు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ప్రణాళిక రూపొందించామని, ఈమేరకు రైతులతో మాట్లాడి సాగుచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయిల్‌పామ్ సాగుపై సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 772 మంది రైతులు 2,280 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేశారని, మరో రెండు వేల ఎకరాలు సాగు లక్ష్యం సాధించాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు కలిగే ప్రయోజనా లు వివరించాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న రైతులకు డ్రిప్ అందించాలని సూచించారు. అసైన్డ్ భూములను సాగుచేస్తున్న రైతులు ఆయిల్‌పామ్ సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. మొక్కలు సరఫరాకు ప్రీ యూనిక్యూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కేటాయించినట్లు తెలిపారు. పెద్దబోనాల వద్ద రెండు ఎకరాల్లో ఏడాది వయసు ఉన్న మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉద్యానవనశాఖ డీడీ శేఖర్, జిల్లా ఉద్యానవన అధికారి లత, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా