ఈ టెక్నికల్ అసిస్టెంట్ మాకొద్దు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తాము నిబంధనల ప్రకా రం పని చేసినా తగిన వేతనం రావడం లేదని ఉపాధిహామీ కూలీలు మంగళవారం నిరసనకు దిగారు. టెక్నికల్ అసిస్టెంట్ ప్రభాకర్ తమకు వద్దంటూ ఇంటి దారి పట్టారు. కూలీలు తెలిపిన వివరాలు. మండలంలోని కోరుట్లపేటలోని అప్ప సముద్రంలో మంగళవారం ఉపాధిహామీ పనులు చేస్తున్న 100 మంది కూలీలు తమకు సరైన వేతనం రావడం లేదని పని స్థలంలోనే నిరసన తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్ మహిళా కూలీలపై దుర్భాషలాడుతున్నాడన్నారు. అతన్ని ఇక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేశారు. పని చేయని వారి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయన్నారు. అవకతవకలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీవో కొమురయ్యను వివరణ కోరగా.. కూలీ డబ్బుల అవకతవకలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు.


