ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో సోమవారం విషాదం నింపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. సారంపల్లికి చెందిన మహమ్మద్ హమీద్(47)కు సోమవారం చాతిలో మంటగా అనిపించింది. కుటుంబ సభ్యులు బద్దెనపల్లిలోని ఆర్‌ఎంపీ క్లినిక్‌కు తీసుకెళ్లగా రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకే హమీద్ స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హమీద్‌ను వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హమీద్ అప్పటికే మరణించాడని తెలపడంతో కు టుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య షబేరా, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆర్‌ఎంపీ నిర్లక్ష్యంతో తన భర్త మరణించాడని మృతుని భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు.
మరిమడ్ల హాస్టల్ విద్యార్థినికి అస్వస్థత
కోనరావుపేట: మండలంలోని మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థిని అస్వస్థతకు గురి కాగా ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. నిహారిక అనే ఆరో తరగతి విద్యార్థిని సోమవారం భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురైంది. గమనించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు వెంటనే 108 అంబులెన్స్‌లో సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.


