దారులన్నీ తెలంగాణ భవన్‌కే.. | - | Sakshi
Sakshi News home page

దారులన్నీ తెలంగాణ భవన్‌కే..

Oct 15 2023 12:32 AM | Updated on Oct 15 2023 12:24 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఎన్నికల పరుగుపందెంలో ముందంజలో ఉన్న అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ.. బరిలో నిలిచే అభ్యర్థులకు ఆదివారం బీ ఫారాలు అందించనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి అసెంబ్లీ బరిలోకి దిగనున్న అభ్యర్థులంతా ఉదయం 9గంటల వరకు తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. అక్కడ 11 గంటలకు సీఎం చేతుల మీదుగా బీ ఫారాలు అందుకోనున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, కొత్త అభ్యర్థులతో పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ కాసేపు మాట్లాడుతారు. భోజనం అనంతరం వారంతా తిరుగుముఖం పడతారు. హుస్నాబాద్‌లో సభా ఏర్పాట్ల నేపథ్యంలో కరీంనగర్‌, సిద్దిపేట, హుస్నాబాద్‌ నేతలు కాస్త ముందుగానే బయల్దేరుతారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఆశావహులు చాలా మంది రాజధానికి చేరుకున్నారని సమాచారం. వీరిలో ముగ్గురు తొలిసారి, ఇద్దరు రెండోసారి, ఆరుగురు మూడోసారి, ఒకరు ఐదోసారి, మరొకరు ఏడోసారి బీ ఫారాలు అందుకోనుండడం గమనార్హం.

ఈ దఫాతో ఎవరెన్నిసార్లంటే..

కొప్పుల ఈశ్వర్‌, ధర్మపురి: ఏడుసార్లు (2004, 2008, 2009, 2010, 2014, 2018, 2023)

కేటీఆర్‌, సిరిసిల్ల: ఐదుసార్లు (2009, 2010, 2014, 2018, 2023)

గంగుల కమలాకర్‌, కరీంనగర్‌: మూడుసార్లు (2014, 2018, 2023)

పుట్ట మధు మంథని: మూడుసార్లు (2014, 2018, 2023)

దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి: మూడుసార్లు (2014, 2018, 2023)

రసమయి బాలకిషన్‌, మానకొండూరు: మూడుసార్లు (2014, 2018, 2023)

వొడితెల సతీశ్‌బాబు, హుస్నాబాద్‌: మూడుసార్లు (2014, 2018, 2023)

డాక్టర్‌ సంజయ్‌, జగిత్యాల: మూడుసార్లు (2014, 2018, 2023)

సుంకె రవిశంకర్‌, చొప్పదండి: రెండుసార్లు (2018, 2023)

► కోరుకంటి చందర్‌, రామగుండం: రెండుసార్లు (2009, 2023)

తొలిసారి అందుకునేవారిలో

డాక్టర్‌. కె.సంజయ్‌ (కోరుట్ల) : తొలిసారి

పాడి కౌశిక్‌రెడ్డి (హుజూరాబాద్‌): తొలిసారి

సీహెచ్‌ లక్ష్మీనరసింహారావు (వేములవాడ): తొలిసారి

విజయంపై ధీమా..
పదేళ్లుగా పార్టీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులే తమను తిరిగి గెలిపిస్తాయని గులాబీ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకున్న 88 సీట్లకు మించి ఈసారి విజయం సాధిస్తామంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 12 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తూ వచ్చిన తాము.. ఈసారి 13కు 13 సీట్లు గెలిచి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శనివారంతో అమావాస్య ముగియనుంది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్‌ సభతో పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించనున్నారు. ఆ వెంటనే బీ ఫారాలు అందుకున్న అభ్యర్థులంతా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. చాలామంది నాయకులు ఎన్నికల ప్రచార రథాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు.

ఆనందంగా ఉంది
నాపై విశ్వాసంతో టికెట్‌ కేటాయించి నేడు బీఫారం అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. మూడు నెలలుగా అన్నివర్గాల ప్రజలతో మమేకం అయ్యాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి. తప్పకుండా భారీ మెజారిటీతో గెలిచి మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేసేందుకు కృషి చేస్తాను.
– చల్మెడ లక్ష్మీనర్సింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement