ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: ప్రజాస్వామ్యం చంద్రబాబు చెప్పు చేతుల్లో ఖూనీ అవుతోందని, అరాచకంగా, అతి క్రూరంగా రాజకీయాలు నడుస్తున్నాయని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పుల్లలచెరువులో 10 మంది వైఎస్సార్ సీపీ నాయకులపై కర్రలు, రాళ్లతో టీడీపీ వాళ్లు దాడి చేశారని, వందల సంఖ్యలో పచ్చ వర్గీయులు ఉన్నా పోలీసులు వాళ్లను ఏమీ అనకుండా విచక్షణా రహితంగా వైఎస్సార్ సీపీ నాయకులపై లాఠీచార్జి చేశారని అరోపించారు. ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు వచ్చిన గిరిజనుల నామినేషన్ పత్రాలు చించేశారని, ఇదేనా ప్రజాస్వామ్యం అని ఆయన ప్రశ్నించారు. ఆడలేక మద్దెల ఓడు రాజకీయానికి చంద్రబాబు పెట్టింది పేరని, ఆయన వెన్నుపోటు రాజకీయాలకు ముందుంటారని మరో సారి రుజువైందన్నారు. తనను సాయంత్రం 5 గంటల వరకు హౌస్ అరెస్ట్ చేశారని, రాష్ట్రం రాక్షస రాజ్యాన్ని తలపిస్తోందని, ప్రజాస్వామ్యం వ్యవస్థ ఉన్నట్లు లేదని, పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నట్లు లేదని, కలెక్టర్, ఆ పై అధికారులు స్పందిస్తున్న పరిస్థితులు లేవని మండిపడ్డారు. ఈ విధంగా రెచ్చకొట్టి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనాలనుకుంటే దానికి తాము బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. నామినేషన్లు స్వేచ్ఛగా వేసుకునేందుకు కలెక్టర్, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీపీలు దొంతా కిరణ్‌గౌడ్, మూడమంచు బాలగురవయ్య, మాజీ జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్ పాల్గొన్నారు.


