సింగరాయకొండ: స్థానిక సంస్థల ఎన్నికలు రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారమే నడుస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీకి ఒక రూల్, వైఎస్సార్ సీపీకి మరో రూల్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ గుండాలు నామినేషన్ కేంద్రాల వద్దే ఉండి నామినేషన్ వేసేందుకు వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీసులు టీడీపీకి అమ్ముడుపోయారని, అందుకు ఈ నామినేషన్ల ప్రక్రియే నిదర్శనమన్నారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య..ఆ పార్టీ గూండాలతో కలిసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై దాడి చేసి నామినేషన్ పత్రాలు చించారని ఆరోపించారు. పాకల–2, కలికవాయ, పాతసింగరాయకొండ, బింగినపల్లి, సింగరాయకొండ–5 ప్రాదేశికాల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో టీడీపీ గూండాలు లాక్కొని దాడి చేసి పేపర్లు చింపివేశారన్నారు. సింగరాయకొండ–5 ప్రాదేశికానికి షేక్ రహీం నామినేషన్ వేసేందుకు వెళుతుండగా..ఆ సమయంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద మించల బ్రహ్మయ్య అతని బృందం దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేశారని, అయినా వారు మరో నామినేషన్ వేశారన్నారు. ఇదంతా ఆర్‌ఓ సమక్షంలో జరిగిందని, వివరాలన్నీ సీసీ కెమెరాలో కూడా రికార్డైనా పోలీసుల చర్యలు లేవన్నారు.
ఎదురొడ్డి నామినేషన్ దాఖలు..
వైఎస్సార్ సీపీ అభ్యర్థులు టీడీపీ గూండాలకు బెదరక ఎదురొడిడ్ నామినేషన్లు వేశారని ప్రశంసించారు. తాను రెండు సార్లు నామినేషన్ కేంద్రం వద్దకు వెళ్లి వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై పోలీసులను నిలదీశానన్నారు. తాను 8 మంది అభ్యర్థులతో నామినేషన్ పత్రాలతో వెళుతుండగా టీడీపీ గూండాలు లాక్కునేందుకు ప్రయత్నించారని, ఇంత కంతా దారుణం ఇంకోటి ఉందా అని ప్రశ్నించారు. నామినేషన్ పత్రాలను చించివేస్తున్నారని ఎస్సై ఎల్ సుధీర్‌కుమార్‌కు మొరబెట్టుకుంటే కానిస్టేబుల్‌ను నామినేషన్ కేంద్రం వరకు తోడుగా పంపించారని, అయినా బ్రహ్మయ్య అనే వ్యక్తి ముగ్గురి వద్ద నామినేషన్ పత్రాలు చించివేశాడని మండిపడ్డారు. పోలీసులు రెడ్‌బుక్ ప్రకారం నడుచుకుంటుంటే ఇక ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. పొన్నలూరు మండలంలో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, కొండపిలో అభ్యర్థులను లోపలికి పోకుండా పోలీసులు అడ్డుకున్నారని, మర్రిపూడి అయితే ఆర్‌ఓ నామినేషన్ పత్రాలు తీసుకోలేదని ఆరోపించారు. చాలా మండలాల్లో అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్నికల తతంగాన్ని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రజలే వీరికి బుద్ధి చెబుతారన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, షేక్ సుల్తాన్, షేక్ కరీం, యన్నాబత్తిన కార్తీక్, సయ్యద్ ఆబిద్‌ఆలీ, యనమల మాధవి, సామంతుల శ్రీకాంత్‌రెడ్డి, పాకనాటి సుబ్బారెడ్డి, మాదాల శంకర్, మలినేని వెంకటేశ్వర్లు, నూకసాని ప్రసాద్, దాసరి శేషయ్య, శ్రీహరిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, గౌరవరపు ప్రభాకరరెడ్డి, మిరియం సుధాకర్, కోమిట్ల వెంకారెడ్డి పాల్గొన్నారు.


