ఉమ్మడి జిల్లాలో భయానకంగా మారిన తొలిరోజు పరిషత్ నామినేషన్ల ప్రక్రియ
వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా కుట్రలు
కనిగిరి, పీసీపల్లెలో వైఎస్సార్ సీపీ ఎంపీపీ అభ్యర్థులపై దాడి
పొదిలిలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రావణి చీర లాగి నామినేషన్ పత్రాలు చించివేత
దర్శిలో కొనసాగుతున్న టీడీపీ గూండాల దౌర్జన్యం
అర్ధవీడు, కొమరోలులో విలేకర్లపై దాడులు, సెల్ఫోన్లు లాక్కున్న వైనం
దర్శి, కనిగిరి, మార్కాపురం, కందుకూరు, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్న టీడీపీ గూండాలు
నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ గూండాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న పోలీసులు
నేడు, రేపు మాత్రమే నామినేషన్ల దాఖలుకు గడువు
ప్రజాస్వామ్యంపై
పరిషత్ పోరులోనూ దాడులు..దౌర్జన్యాలు..మారని ఖాకీల తీరు
పరిషత్ పోరులోనూ అధికార మదం పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడింది. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి.. ప్రతిపక్షాల గొంతు నులిమి.. నామినేషన్ల ప్రక్రియనే భయానకంగా మార్చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుపడగా.. కొన్ని చోట్ల పోలీసులు సైతం వారికి వంతపాడారు. మహిళా అభ్యర్థులపై దాడులు చేస్తూ చీరలు లాగి అవమానించారు. నామినేషన్ పత్రాలు చించేశారు.. రాళ్లతో విరుచుకుపడ్డారు. ఖాకీలే లాఠీలకు పనిచెప్పి భయోత్పాతం సృష్టించారు. నామినేషన్లు వేయడానికి వస్తే అక్రమ కేసులు బనాయిస్తామంటూ బెదిరింపులకు దిగారు. గిద్దలూరు నియోజకవర్గంలో వార్తలు సేకరిస్తున్న విలేకర్లపైనా దాడులు చేసి సెల్ఫోన్లు లాక్కొని, కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించారు. బుధవారం నామినేషన్ల తొలిరోజే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు.. పరిషత్ పోరులో ప్రజాస్వామ్యానికి పట్టిన దుస్థితికి అద్దం పట్టాయి.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియతో ప్రారంభమైన టీడీపీ గూండాల అరాచకాలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పర్వంలో మరింత బరితెగించాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటూ గూండాగిరికి దిగుతున్నారు. ఏకంగా నామినేషన్ కేంద్రాల్లోనే తిష్టవేసి ప్రత్యర్థుల నామినేషన్ పత్రాలను లొక్కొని చించేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మూడు మండలాల్లో, మార్కాపురం జిల్లాలో 8 మండలాల్లో పోలీసులు, టీడీపీ గూండాలు తెగబడి నామినేషన్ పత్రాలు చించేశారు. దీంతోపాటు ప్రకాశం జిల్లాలో 14 మండలాల్లో, మార్కాపురం జిల్లాలో 13 మండలాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకుండా అడ్డుకొన్నారు. దీంతో తొలిరోజే జిల్లాలో నామినేషన్ ప్రక్రియ భయానకంగా మారింది. తొలిరోజు జరిగిన దాడులు ఇవే..
మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో కేంద్రంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి దొనపాటి శ్రావణి పట్ల టీడీపీ గూండాలు దుశ్శాసన పర్వానికి ఒడిగట్టారు. నామినేషన్ కేంద్రంలోనే ఆమె చీరలాగి, చేతుల్లోని నామినేషన్ పత్రాలు చించివేసి రక్తం వచ్చేలా కొట్టి బయటకు నెట్టేశారు. దీంతో ఆమె పార్టీ పరిశీలకుడు కేవీ రమణారెడ్డితో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులు సమక్షంలోనే ఇది జరగడం శోచనీయం.
● కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ ఎంపీపీ అభ్యర్థిని పోలు వరలక్ష్మి నామినేషన్ పత్రాలను టీడీపీ గూండాలు లొక్కొని చించేశారు. సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం ఎంపీటీసీ అభ్యర్థి జొన్నపూతల దివ్యభారతి నామినేషన్ పత్రాలను సైతం చించేశారు.
● గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలంలో కోర్టు ఆర్డర్ కాపీలను ఏఆర్ఓకు చూపించేందుకు వెళ్తున్న బేస్తవారిపేట మాజీ ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, ఎంపీపీ అభ్యర్థి షేక్ మున్వర్బాషాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మాట్లాడుతుండగానే చేతిలో ఉన్న కోర్టు ఆర్డర్ కాపీలను లాక్కొని టీడీపీ ఎంపీపీ అభ్యర్థి గంగయ్య చింపేశాడు. అదే సమయంలో నామినేషన్ వేసేందుకు అక్కడికి వచ్చిన ఎంపీటీసీ అభ్యర్థి పీ ఈశ్వరరెడ్డి నామినేషన్ పత్రాలను రౌడీలలాగా మీదపడి లాక్కున్నారు. దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నామినేషన్ వేయనీయకపోవడంతో నేకునాంబాద్ గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఎస్ శ్రీరాములు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గిద్దలూరు నియోజకవర్గం కంభం నాయక్వీధి ఎంపీటీసీ అభ్యర్థి షేక్ మహమ్మద్ రఫీ నామినేషన్ వేసేందుకు వెళ్లి కార్యాలయం ఆవరణలో హెల్ప్‌డెస్క్ వద్ద పత్రాలు చూపిస్తున్న తరుణంలో అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు దౌర్జన్యంగా వారి వద్ద నుంచి నామినేషన్ పత్రాలు లాక్కొని చింపేశారు. ఈ తతంగం అంతా ఎంపీడీఓ ఎదురుగా జరిగింది. అధికారులు ఏర్పాటు చేసిన కెమెరామెన్ సైతం అంత గొడవ జరుగుతున్నా వీడియో తీయకపోవడం గమనార్హం. అనంతరం కందులాపురం తూర్పు అభ్యర్థి పెరుమారెడ్డి నందిరెడ్డి, కందులాపురం పడమర అభ్యర్థి బొర్రా నాగభూషణం నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా పోలీసులు చూస్తుండగానే నామినేషన్ పేపర్లను టీడీపీ నాయకులు దౌర్జన్యంగా లాక్కొని చించేశారు. ఇదే నియోజకవర్గం అర్థవీడు, రాచర్ల మండలంలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. విలేకర్లపైనా దాడులకు తెగబడ్డాయి. కొమరోలు ‘సాక్షి’ విలేకరి సెల్‌ఫోనును లాక్కున్నారు. అర్ధవీడులో సైతం ఓ పత్రికా విలేకరి ఫోనును లాక్కున్నారు. ఫొటోలు తీస్తే కేసులు పెట్టి లోపల తోయిస్తామని బెదిరించారు. అర్ధవీడు మాజీ ఎంపీపీ గొటిక రాజేశ్వరరెడ్డిపై రాళ్లతో దాడి చేశారు. దర్శి నియోజవకర్గం ముండ్లమూరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని సూదిదేవర నాగమణి నామినేషన్ పత్రాలను లాక్కొని చించి బయటకు నెట్టారు.
● కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు నామినేషన్ కేంద్రంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేసేందుకు పోలీసులు అనుమతించలేదు. నామినేషన్ కేంద్రంలో గంటల తరబడి టీడీపీ గూండాలు తిష్టవేసి నామినేషన్ పత్రాలు లాక్కొని చించేశారు. విషయం తెలుసుకున్న పార్టీ ఇన్చార్జీ బుర్రా మధుసూదన్‌యాదవ్ గుడ్లూరు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదెక్కడి అన్యాయమంటూ నిలదీశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇలా అనేకచోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నాయి.
● కొనకనమిట్ల మండలానికి సిద్ధవరం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున రావినూతల ప్రసన్నకుమారి, కాట్రగుంట ఎంపీటీసీ స్థానానికి మోరా అరుణ నామినేషన్ వేసేందుకు సాయంత్రం 4 గంటల తరువాత నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. అప్పటికే మండల టీడీపీ నేత పెరికె సుఖ్‌దేవ్ అలియాస్ బూన్ తన మనుషులతో లోపలికి ప్రవేశించి నామినేషన్ వేస్తున్న ప్రసన్న కుమారి, అరుణల చేతులలో ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కొని చించేసి బయటకు పరుగు తీశారు. ఇది అన్యాయం అంటూ అభ్యర్థులతో పాటు మండల పార్టీ కన్వీనర్ మోరా శంకర్‌రెడ్డి టీడీపీ నేతను నిలదీశారు. అప్పటికే నామినేషన్ కేంద్రం పరిసరాల్లో ఉన్న టీడీపీ గూండాలు శంకర్‌రెడ్డిపై గొడవకు దిగారు. పోలీసులు కలుగచేసుకొని ఇరువురినీ పక్కకు పంపారు. కాగా అప్పటికే వైఎస్సార్ సీపీకి చెందిన కొంత మంది టీడీపీ గూండాలను చుట్టుముట్టి పట్టుకోవడానికి ప్రయత్నించడంతో కార్యాలయం గోడ దూకి పరారయ్యారు.
కేంద్రాల వద్ద పోలీస్ గూండాగిరి...
చెప్పేటందుకే శ్రీరంగనీతులు అన్న సామెతగా తయారైంది పోలీసుల పరిస్థితి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రారంభం సందర్భంగా కేంద్రాల వద్ద మైక్‌లు ఏర్పాటు చేసిన పోలీసులు నీతి వాక్యాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నామినేషన్లు ప్రశాంతంగా వేసుకోవాలని, ఎవరైనా అడ్డుకుంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలి వంటి నీతి వాక్యాలు చాలానే పెట్టారు. కానీ అసలు పోలీసులే నామినేషన్లు వేసే అభ్యర్థుల పాలిట సైంధవులగా మారి దౌర్జన్యాలకు దిగుతుంటే ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి అభ్యర్థులది. ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులను కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, కావాలనే రెచ్చగొట్టేలా ప్రవర్తించి కేసులు పెట్టాలనే దురుద్దేశపూరిత కుట్రలకు పాల్పడడం, సమయం ముగిసే వరకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అడ్డగించి తరువాత సమయం ముగిసింది అని చెప్పి అక్కడి నుంచి పంపేయడం వంటి అనేక దుశ్చర్యలకు పోలీసులు పాల్పడుతున్నారు. పుల్లలచెరువు మండలం పుల్లలచెరువులోని ఎంపీటీసీ 1, 2 స్థానాలకు భానవత్ సరోజాభాయ్, యాకసిరి రఘు నామినేషన్ వేసేందుకు వెళ్లారు. అదే సమయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన వందలాది మంది పచ్చమూకలు ఒక పథకం ప్రకారం వారిపై దాడులకు దిగారు. అక్కడే ఉన్న పోలీసులు పచ్చమూకల జోలికి వెళ్లకుండా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, వారిని బలపరిచేందుకు అక్కడికి వెళ్లిన వారిపై లాఠీలతో దాడులు చేశారు.
దర్శిలో ఆగని దాష్టీకం...
మున్సిపల్ నామినేషన్ల సందర్భంగా పోలీసులే...పచ్చగుండాల మాదిరిగా వైఎస్సార్సీపీ అభ్యర్థులను అడ్డుకొని, టీడీపీ గూండాలకు సహకరించారు. పోలీసులే లాఠీఛార్జి చేస్తున్న సమయంలో ఎస్సైకి తగిలిన గాయం సాకుగా చూపి, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. మొదట 21 మంది, ఇతరులు అంటూ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాని తరువాత టీడీపీ నియోజకవర్గ స్థాయి నేత ఒత్తిడితో దాని సంఖ్య 131 మందికి చేర్చేలా చేశారు. ఇంకా నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలను కేసులో ఇరికించే యత్నం చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసే వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఫోన్ చేసి, నామినేషన్ కేంద్రాల వద్దకు వస్తే కేసులో మీపేర్లు చేర్చి ఆరెస్టు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నామినేషన్ గడువు ఇవ్వడంతో, పట్టణంలో క్రియాశీలకంగా వైఎస్సార్ సీపీ నేతల పేర్లు కేసుల్లో చేర్చేలా టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. మొత్తం మీద దర్శిలో స్థానిక పోలీసుల ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఘటన సమయంలో లేని వారిని కేసులో పెట్టడంతో, పోలీసులపై, న్యాయ పోరాటం చేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
గెలవలేకే గూండా గిరి
టీడీపీ నేతలు గెలవడం చేతకాక ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. నామినేషన్ వేయడానికి లోపలికి వెళ్లి పత్రాలు ఇస్తుంటే టీడీపీ నేత తన మనుషులతో పత్రాలు లాక్కొని పోలీసుల ముందే చించడం దుర్మార్గం. అసలు టీడీపీ నేతను లోపలకు ఎందుకు రానిచ్చారు. ఇలాంటి దుర్మార్గులకు బుద్ధిచెప్పే రోజులు దగ్గర పడ్డాయి. నామినేషన్ కేంద్రంలో అలజడి సృష్టించిన సుఖ్‌దేవ్ బూన్‌పై చర్యలు తీసుకోవాలి.
– ప్రసన్న కుమారి, అరుణ, కొనకనమిట్ల మండలం
నామినేషన్ కోసం వెళితే చించేశారు
వైఎస్సార్ సీపీ తరఫున ముండ్లమూరు ఎంపీటీసీగా నామినేషన్ వేసేందుకు ముండ్లమూరు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లాం. టీడీపీ మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు, మాజీ జెడ్పీటీసీ కే నాగరాజు దౌర్జన్యం చేసి నామినేషన్ పత్రాలు లాక్కుని చించేశారు. పోలీసులు అక్కడే ఉన్నా నోరు మెదపడం లేదు. 500 మంది టీడీపీ కార్యకర్తలు అక్కడే ఉండి రౌడీల్లా నామినేషన్ పత్రాలు లాక్కుని చించేస్తున్నా పోలీసులు గుడ్లప్పగించి చూస్తున్నారు. కలెక్టర్, ఎస్పీలు కల్పించుకుని నాకు రక్షణ కల్పించి నామినేషన్లు వేయించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
– సూదిదేవర నాగమణి, ముండ్లమూరు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి


