బెదిరింపులు.. కిడ్నాప్‌లతో ప్రజాస్వామ్యానికి తూట్లు | - | Sakshi
Sakshi News home page

బెదిరింపులు.. కిడ్నాప్‌లతో ప్రజాస్వామ్యానికి తూట్లు

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

● వైఎస్సార్‌ సీపీ ఒంగోలు ఇన్‌చార్జి చుండూరి రవిబాబు

ఒంగోలు సిటీ: ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి గెలవాలే తప్ప, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేయడం సరికాదని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు విమర్శించారు. ఒంగోలులోని వైఎస్సార్‌ పీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 56, 57వ డివిజన్లలో గత మూడు రోజులుగా బెదిరింపులు, ప్రలోభాల పర్వం కొనసాగుతోందని ఆరోపించారు. గతంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై భూకబ్జాలు, కుంభకోణాలకు సంబంధించి ఆరోపణలు చేసిన టీడీపీ నాయకులు.. ఇప్పుడు ఈడీ కేసులు, బంగారం, డబ్బుల మార్పిడికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థినే తీసుకువచ్చి మేయర్‌ అభ్యర్థిగా నిలబెట్టడం ఏంటని నిలదీశారు. గతంలో ఇతరులపై ఆరోపణలు చేసిన నాయకులు, ఇప్పుడు అనుసరిస్తున్న వైఖరిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అభ్యర్థుల కుటుంబాలను వేధించడం దారుణం

చదువుకున్న యువతికి టికెట్‌ ఇచ్చామని చెబుతున్న టీడీపీ నాయకులు మహిళా అభ్యర్థుల కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రవిబాబు ఆరోపించారు. 57వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి ఆనం ప్రత్యూషను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరించారని, ఆమె సోదరుడిని చంపేస్తామని హెచ్చరించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల భార్యలు, తల్లులు, పిల్లలను సైతం మానసికంగా వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బలముంటే ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి గెలవాలని, బెదిరింపులు, కిడ్నాప్‌ ఆరోపణలకు తావిచ్చే చర్యలకు పాల్పడకూడదని హితవు పలికారు.

వ్యాపారులపై అధికారుల ఒత్తిళ్లు..

ఆర్యవైశ్యులకు టికెట్లు కేటాయించిన సందర్భంలోనూ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుంటున్నారని రవిబాబు ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న వ్యాపారులకు చెందిన మందుల దుకాణాలపై డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతో వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే అనుమానాలకు తావివ్వకూడదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఒత్తిడి తీసుకురావడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.

కూటమిలో ఐక్యత కరువు

కూటమిలో ఐక్యత లేక ఒకే స్థానానికి బీ–ఫారాలు మార్చుకుంటూ పోటీ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ టికెట్లను వ్యాపారులకు, అవకాశవాదులకు కేటాయించిందని ఆరోపించారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆత్మస్థైర్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నగరంలోని 62 డివిజన్లలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. బెదిరింపులు, ప్రలోభాలతో అభ్యర్థులను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. 25వ డివిజన్‌ నుంచి రాజేష్‌ అనే అభ్యర్థిని భయపెట్టి బెదిరించి కిడ్నాప్‌ చేశారన్నారు. అదే డివిజన్‌లో వి.శ్రీకాంత్‌కు బీ–ఫారం ఇచ్చినా పంపించినా ఆర్‌ఓ పక్షపాతంగా వ్యవహరించి అసత్యాలు ప్రచారం చేశారని, ఈ వ్యవహారంలో ఆర్‌ఓపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆ డివిజన్‌ నుంచి శ్రీకాంత్‌ తమ పార్టీ అభ్యర్థిగానే పోటీలో ఉంటారని, ఎన్నికల సంఘం కేటాయించే గుర్తుతో ఆయన బరిలోకి దిగుతారని రవిబాబు పేర్కొన్నారు. హౌసింగ్‌ బోర్డు ప్రాంతంలో శ్రీకాంత్‌ తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు.

బీ–ఫారం చించేయడం దుర్మార్గం: కుప్పం ప్రసాద్‌

ఒంగోలులోని రామ్‌నగర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో వైఎస్సార్‌సీపీ ఒంగోలు మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ మాట్లాడుతూ 25వ డివిజన్‌ అభ్యర్థికి బీ–ఫారం ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తిని కొట్టి, పత్రాన్ని చించేశారని, ఇది దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ప్రత్యర్థులను ఎదుర్కోవాలే తప్ప, అభ్యర్థిని కొట్టి బీ–ఫారం చించేయడం పిరికిపంద చర్య అని దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న ఒంగోలులో అశాంతిని సృష్టించేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయ చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement