కూటమిలో అసమ్మతి సెగలు | - | Sakshi
Sakshi News home page

కూటమిలో అసమ్మతి సెగలు

Oct 18 2026 2:36 AM | Updated on Oct 18 2026 2:36 AM

కూటమిలో అసమ్మతి సెగలు

కందుకూరు: ఒకే ఒరలో రెండు కత్తులు వరగవు అన్న చందంగా తయారైంది నియోజకవర్గంలో కూటమి పార్టీల పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాన్ని తేల్చుకోలేక బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. కూటమిలో కీలకంగా ఉన్న జనసేనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, తమకు కనీసం మర్యాద కూడా దక్కడం లేదంటూ వాపోతున్నారు. ఈ మేరకు శనివారం టీడీపీ కార్యాలయం వద్ద చోటు చేసుకున్న సంఘటనలతో రెండు పార్టీ మధ్య విభేదాలు ఒక్కసారి బహిర్గతమయ్యాయి.

ఎమ్మెల్యే ఇంటూరి తీరుపై తీవ్ర విమర్శలు

ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి జోరుగా ఉంది. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన మధ్య మాత్రం పొత్తు కుదరడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీతో సీట్ల పంపకం తేల్చుకునేందుకు జనసేన నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి, ప్రస్తుతం స్థానిక సంస్థల జనసేన పరిశీలకుడు పులి మల్లికార్జున శనివారం టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును కలిసి సీట్ల పంపకంపై వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు కనీసం పులి మల్లికార్జునతో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపకపోగా వినతి పత్రం స్వీకరించేందుకు నిరాకరించి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పులి మల్లికార్జున ఎమ్మెల్యే తీరుపై బహిరంగ విమర్శలకు దిగారు. నియోజకవర్గంలో జనసేనకు కనీస మర్యాద దక్కడం లేదని, నియోజకవర్గంలోని ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో ఒక స్థానం అయినా జనసేనకు ఇవ్వాలని అడుగుతుంటే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలేటివారిపాలెం జెడ్పీటీసీ స్థానం ఎస్సీలకు రిజర్వ్‌ అయిన నేపథ్యంలో ఆ స్థానం నుంచి జనసేన అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మూడు నెలల క్రితమే వేరే వ్యక్తికి మాట ఇచ్చానని చెప్తున్నారని, అదే సందర్భంలో కందుకూరు మండల జెడ్పీటీసీ సీటు ఇవ్వమని అడిగితే గతంలో ఏఎంసీ చైర్మన్‌ ఇస్తానని ఇవ్వలేక పోయిన టీడీపీ నాయకుడికి ఆ సీటు కేటాయించినట్లు ఎమ్మెల్యే చెప్తున్నారన్నారు. ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో ఒక్కటి కూడా జనసేనకు ఇచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. ఇదేం పొత్తు ధర్మం అని నిలదీశారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

దళితులమని అవమానిస్తున్నారా?

జనసేన తరఫున నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసిన తాను సీట్ల కేటాయింపుపై మాట్లాడేందుకు వస్తే కనీసం పట్టించుకోకపోవడం ఏంటని, అదే బీజేపీ నాయకులు వస్తే మాత్రం వారితో మాట్లాడేందుకు సమయం ఉంటుందా.. అని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. అంటే బీజేపీ నాయకులు తమ కులం వాళ్లు కాబట్టి ఎమ్మెల్యే గౌరవించి మాట్లాడుతున్నారని, అదే జనసేన తరఫున దళితులం కాబట్టి అవమానిస్తున్నారని మల్లికార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయం ముందే రోడ్డుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే అనుచరుడు సురేష్‌ బయటకు వచ్చి ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. కూర్చొని మాట్లాడుకుందాం..అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మల్లికార్జున మాత్రం తన ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందంటూ జనసేన నాయకుడు పులి మల్లికార్జున ఆగ్రహం

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కనీస

మర్యాద ఇవ్వడం లేదంటూ తీవ్రస్థాయిలో ధ్వజం

కందుకూరు నియోజకవర్గంలో జనసేన

అంత చులకనైందా..అంటూ నిలదీత

ఎన్నికలకు ముందే కూటమిలో విభేదాలు బహిర్గతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement