కొనకనమిట్లలో యువకుడి హత్య | - | Sakshi
Sakshi News home page

కొనకనమిట్లలో యువకుడి హత్య

Oct 18 2026 2:36 AM | Updated on Oct 18 2026 2:36 AM

కొనకనమిట్లలో యువకుడి హత్య

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ, స్థానికులు

నవీన్‌రెడ్డి మృతదేహం

కొనకనమిట్ల: మండల కేంద్రం కొనకనమిట్లలో శనివారం ఓ యువకుడి హత్య కలకలం రేపింది. భూవివాదాల నేపథ్యంలో యువకుడిని కొనకనమిట్ల నుంచి కాట్రగుంట వెళ్లే దారి పక్కన ఉన్న కొండ ప్రాంతంలో విచక్షణా రహితంగా కొట్టి చంపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కొనకనమిట్లకు చెందిన పునుగోటి గురవారెడ్డి కుమారుడు నవీన్‌రెడ్డి (27)కి తన బంధువులైన సూరవరపు వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులకు గతంలో భూతగాదాలు ఉన్నాయి. గతంలో ఇరువర్గాలు పోలీసుస్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నట్లు సమాచారం. ఏడాదిగా ఇరు కుటుంబాలు అప్పుడప్పుడూ గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి.

బంధువులే కొట్టి చంపారు..

తన కుమారుడు నవీన్‌రెడ్డిని తమ బంధువులైన సూరవరపు వెంకటేశ్వరరెడ్డి, కుమారుడు నారాయణ, సూరవరపు తిరుపతిరెడ్డి, పునుగోటి చంద్రశేఖర్‌, పునుగోటి వెంకటేశ్వరరెడ్డి, పునుగోటి గరటారెడ్డిలు కావాలనే కక్ష పెట్టుకుని పొలం వెళ్లిన నవీన్‌రెడ్డిని వెంటాడి విచక్షణా రహితంగా కర్రలతో కొట్టి చంపారని తండ్రి గురవారెడ్డి ఆరోపిస్తున్నాడు. హత్యకు కారణాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గతేడాది పొలం తగాదా కారణంగా గొడవలు జరగగా తన కుమారుడిని సూరవరపు వెంకటేశ్వరెడ్డి కుటుంబ సభ్యులు విపరీతంగా కొట్టడంతో నవీన్‌రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. అప్పట్లో వైద్యశాలలో చూపించారు. అప్పటి నుంచి నవీన్‌రెడ్డి మానసిక పరిస్థతి కూడా బాగా లేదు. నాలుగు నెలల క్రితం పనిపై హైదరాబాద్‌ వెళ్లి ఇటీవల ఇంటికి వచ్చాడు. నవీన్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గంట తర్వాత ఫోన్‌ చేయగా కాట్రగుంట దారిలో తన పొలం వద్దకు వెళ్లినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఫోన్‌ చేయగా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కాట్రగుంట దారిలో వెతకగా కొంతమంది ఎవరినో తరుముకుంటూ కొండ దారిన వెల్లినట్లు పొలాల నుంచి వచ్చే కూలీలు తెలిపారు. రాత్రంతా కుమారుడి కోసం వెతికారు. తన కుమారుడిని తమ బంధువులే కొట్టి చంపారని నిర్థారణకు వచ్చి శనివారం ఉదయం కొండ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. ఆరుగురు కళ్లల్లో కారం చల్లి కర్రలతో కొట్టి చంపారని నవీన్‌రెడ్డి తండ్రి ఆరోపించాడు. నిందితులు ఆరుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని తండ్రి పోలీసులను కోరాడు. నిందితులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని హతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలం వద్ద పరిస్థితి చూసి నవీన్‌రెడ్డి తల్లి రమణమ్మ, బంధువులు భోరున విలపించారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

కొనకనమిట్ల సమీపంలోని కొండ ప్రాంతంలో యువకుడి హత్య జరిగినట్లు తెలసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇన్‌చార్జి సీఐ వినోద్‌కుమార్‌, ఎస్‌ఐ శ్రీకాంత్‌, క్రైం పోలీసులు హత్యకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరు నుంచి వచ్చిన ఫోరెన్సిక్‌ క్లూస్‌ టీమ్‌ కూడా సంఘటన స్థలంలో వేలిముద్రలు సేకరించింది. మృతుడు నవీన్‌రెడ్డి తండ్రి గురవారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. హత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

నవీన్‌రెడ్డి (ఫైల్‌)

మృతుడి తండ్రి గురవారెడ్డి

భూతగాదాల నేపథ్యంలో కొట్టి చంపిన బంధువులు

బంధువులే తన కుమారుడిని హత్య చేశారంటున్న తండ్రి

నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement