న్యూస్‌రీల్
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం అస్తవ్యస్తం పట్టా చేతిలో ఉన్నా.. ఇల్లు కట్టుకునే స్థలం ఏదో తెలియని దుస్థితి ప్లాట్ల కేటాయింపులో గజిబిజి.. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం పునరావాసం కోసం కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు సర్వం కోల్పోయి.. అద్దె ఇళ్లలో నిర్వాసితుల అష్టకష్టాలు
ప్రజలకు సేవచేసే వలంటీర్లకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తే ప్రజాధనం దుర్వినియోగం.. అదే కూటమి ప్రభుత్వానికి డప్పు కొట్టేందుకు సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లకు డబ్బులు ఇవ్వడం సద్వినియోగమా..? ఇదేనా కూటమి పార్టీ నీతి. కరోనా కష్టకాలంలో ప్రజలకు విశేష సేవలు అందించిన వలంటీర్లకు ఎన్నికల సమయంలో జీతం పెంచుతామని ఇచ్చినా హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కి వారిని ఏకంగా తొలగించింది.
– సురభి జేమ్స్, మాజీ వలంటీర్ అద్దంకి మండలం కలవకూరు గ్రామం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్లకు రూ.5 వేలు నగదు ఇస్తే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న పనేంటి. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్లర్ల పాలసీ తెచ్చి పెట్టి ప్రభుత్వ సొత్తు దోచిపెట్టడం లేదా? కరోనా సమయంలో మేము చేసిన సేవ మీకు కనిపించలేదా? ఆ సమయంలో ఒక్కరైనా బయటకు వచ్చారా? సేవ చేశారా?
– దారుకుమల్లి పెద్దిరెడ్డి, మాజీ వలంటీర్, మర్రిపూడి
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కోసం పుట్టిన ఊరు, ఇళ్లు, భూములు, జీవనాధారాలను త్యాగం చేసిన నిర్వాసితుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రాజెక్టు కోసం గ్రామాలు ముంపునకు గురై.. తమ సర్వస్వాన్ని కోల్పోయిన కుటుంబాలకు పునరావాసం కల్పించడంలో స్పష్టత కొరవడింది. పట్టాలు ఇచ్చామని అధికారులు చెబుతున్నా.. వాటికి సంబంధించిన స్థలం ఎక్కడుందో చూపించకపోవడంతో నిర్వాసితులు అయోమయానికి గురవుతున్నారు. చేతిలో పట్టా ఉన్నా.. ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో తెలియని దుస్థితి నెలకొంది.
పట్టాలు చేతిలో ఉన్నా ఉపయోగం లేదు
అధికారులు మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కానీ ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం మాత్రం చూపించలేదు. వేరే చోట ఉండేందుకు సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పట్టాలు చేతిలో ఉన్నా.. స్థలం తెలియక ఇల్లు ఎలా కట్టుకోవాలో అర్థం కావడం లేదు. అధికారులు వెంటనే స్థలం చూపించి, ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నాం.
– కొమ్మతోటి కాశమ్మ, గొట్టిపడియ
పట్టా ఇచ్చినా స్థలం చూపలేదు
అధికారులు మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కానీ ఇల్లు నిర్మించుకోవాల్సిన స్థలం ఎక్కడో ఇప్పటి వరకు చూపించలేదు. పట్టా చేతిలో ఉన్నా.. స్థలం తెలియక ఇల్లు ఎలా కట్టుకోవాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం వెంటనే స్థలం చూపించి, ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలి.
– నాలి కొండయ్య యాదవ్, గొట్టిపడియ
మార్కాపురం/మార్కాపురం రూరల్: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం పరిస్థితి దయనీయంగా మారింది. సొంత గ్రామాలను, భూములను వదులుకున్న వారికి ప్రభుత్వం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసినా అక్కడ సమస్యలు మాత్రం తీరడం లేదు. కాగితాలపై ప్లాట్ల కేటాయింపులు, ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం నిర్వాసితులకు ఇబ్బందులు తప్పడం లేదు. కలనూతల, సుంకేసుల, గొట్టిపడియ తదితర గ్రామాల నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు, ప్లాట్ల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం వంటి అంశాలు సమస్యలుగా మారాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీల్లో ప్లాట్లు చూపించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్లాట్లు ఉన్నా.. నిర్మాణం ఎక్కడ?..
మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తాండ నిర్వాసితులకు కుంట వద్ద, పెద్దారవీడు మండలం సుంకేశుల, కలనూతల, చింతలముడిపి గ్రామాల వారికి గోగులదిన్నె వద్ద, సుంకేశులలోని ఎస్సీలకు తోకపల్లి వద్ద, కలనూతలలోని కొంతమందికి స్థలాలను కేటాయించారు. పట్టాలు ఇచ్చారు. కానీ స్థలమెక్కడో చూపకపోవడంతో ఇళ్లనిర్మాణం ముందుకు సాగడంలేదు. ప్లాట్ల హద్దులు, కేటాయింపుల విషయంలో స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ‘స్థలం ఎక్కడుందో చూపించండి.. ఇల్లు కట్టుకుంటాం’ అని అధికారులను అడిగినా స్పష్టమైన సమాధానం లభించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు పూర్తి చేయకుండా ప్లాట్ల కేటాయింపుతోనే అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. పునరావాస కాలనీల్లో సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కనిపించడం లేదని చెబుతున్నారు.
సర్వం కోల్పోయి..అద్దె ఇళ్లలో
ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములను, ఇళ్లను వదులుకున్న కుటుంబాలు ప్రస్తుతం సొంత నివాసం లేక అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నాయి. గతంలో 10, 20 ఎకరాల వరకు భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగించిన కుటుంబాలు.. ఇప్పుడు ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అద్దె ఇళ్లకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని.. మరోవైపు జీవనాధారం లేకపోవడంతో ఆ మొత్తం కూడా భారంగా మారిందని నిర్వాసితులు వాపోతున్నారు.
వసతులు ఎక్కడ?:
పునరావాసం అంటే కేవలం ఇల్లు లేదా ఇంటి స్థలం కేటాయించడం మాత్రమే కాదని.. అక్కడ తాగునీరు, రహదారులు, విద్యుత్, డ్రైనేజీ, విద్య, వైద్యం వంటి కనీస వసతులు ఉండాలని నిర్వాసితులు కోరుతున్నారు. అయితే తమకు కేటాయించిన ప్రాంతాల్లో మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని గొట్టిపడియ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు.
ప్యాకేజీ కోసం కార్యాలయాల చుట్టూ..
పునరావాస ప్యాకేజీ అందని కుటుంబాలవారు ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని నిర్వాసితులు చెబుతున్నారు. ప్రతిరోజూ సుమారు 30 నుంచి 50 మంది వరకు కలెక్టరేట్‌కు వచ్చి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా.. పరిష్కారం మాత్రం కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయాల వద్ద వేచి ఉండి.. అధికారులు, సిబ్బందిని కలిసేందుకు ప్రయత్నించి.. చివరకు నిరాశతో తిరిగి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.
‘ప్యాకేజీ ఇప్పిస్తాం’ అంటూ డబ్బులు డిమాండ్ ?
ఇదిలా ఉండగా.. తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి కొందరు కూటమి నాయకులు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు నిర్వాసితుల నుంచి వినిపిస్తున్నాయి. ప్యాకేజీ వస్తుందన్న ఆశతో అప్పులు చేసి మరీ డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలి:
నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. ప్రతి కుటుంబానికి ప్యాకేజీ, ఇంటి స్థలం, పట్టా, పునరావాసం వివరాలను ఒకే చోట పరిశీలించి.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పట్టాలు పొందిన వారికి కేటాయించిన స్థలాలను క్షేత్రస్థాయిలో చూపించి.. హద్దులు నిర్ధారించాలని కోరుతున్నారు. పునరావాస ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఖాళీ స్థలాలే దర్శనమిస్తున్నాయి
పునరావాస గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ప్లాట్లు ఏర్పాటు చేశారు. గుండంచర్ల (దేవరాజుగట్టు)లో 714, సుంకేసుల–1 (గోగులదిన్నె)లో 1,311, గొట్టిపడియలో (వేములకోట) 735, సుంకేసుల–2 (తోకపల్లి)లో 310, కలనూతల–1(ఇడుపూరు)లో 351, కలనూతల–2 (ఇడుపూరు2)లో 265 ప్లాట్లు కేటాయించారు. కానీ కాలనీల్లో అన్నీ ఖాళీ స్థలాలు కనిపిస్తున్నాయి. ఇళ్ల నిర్మాణానికి అనువైన వాతావరణం కల్పించకపోవడంతో కాలనీలు పూర్తి స్థాయిలో నివాస ప్రాంతాలుగా మారడం లేదు.


