వామపక్ష పార్టీల డిమాండ్
ఒంగోలు టౌన్: ఎన్నికల అక్రమాలకు పాల్పడి దేశ ప్రజల విశ్వాసాన్ని, ప్రజాస్వామ్యాన్ని క్రూరంగా హతమార్చిన భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలని, ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీద చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ శుక్రవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ సర్ పేరుతో దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది పేర్లను తొలగించడం అత్యంత దారుణమని విమర్శించారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఆర్.మోహన్ మాట్లాడుతూ కోట్లాదిమందికి ఓటు హక్కు లేకుండా చేయడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని చోటు లేకుండా చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటరావు మాట్లాడుతూ ఏ దేశంలో అయినా ఓటర్ల సంఖ్య పెరుగుతుంది కానీ మోదీ పాలనలో ఓటర్ల సంఖ్య కుదిస్తున్నారని దీని వెనక కుట్రలను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బయటపెట్టిందని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కె మాబు మాట్లాడుతూ సర్ పేరుతో ఏకంగా 13 కోట్ల ఓట్లను తొలగించడం అసాధారణమని తెలిపారు. సీపీఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల అక్రమాలకు కారణమైన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఏ సాలార్, పి.కల్పన, పద్మ, ఎల్.రాజశేఖర్, జయంతిబాబు, బంకా సుబ్బారావు పాల్గొన్నారు.


