అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను భాగస్వాములను చేసి నిర్వహించాలి వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు
ఒంగోలు సిటీ:
ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల చరిత్రను టీడీపీ తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం సరికాదని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు అన్నారు. మున్సిపల్ ఉత్సవాన్ని నగర ప్రజలందరి పండుగగా నిర్వహించాల్సి ఉండగా టీడీపీ కార్యక్రమంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. శుక్రవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవిబాబు మాట్లాడారు. మున్సిపల్ ఉత్సవానికి నగర ప్రజలందరినీ భాగస్వాములను చేయడంతో పాటు జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల ప్రతినిధులను ఆహ్వానించాల్సి ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ, వైఎస్సార్ సీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని ఉత్సవాన్ని నిర్వహిస్తే అది నగర ప్రజలందరి పండుగగా నిలిచేదన్నారు. ఉత్సవ సభకు శాసనమండలి డిప్యూటీ స్పీకర్ తూమాటి మాధవరావును, జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిని సైతం ఉత్సవానికి ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు. జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించినప్పటికీ తమ పార్టీకి చెందిన దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పేరును ప్రస్తావించకపోవడం కూడా వివక్షకు నిదర్శనమన్నారు. కనీస ప్రొటోకాల్ కూడా పాటించలేదని మండిపడ్డారు.
టీడీపీ ఘనతగా చూపడం ఏమిటి..?
150 ఏళ్ల క్రితం ఏర్పడిన మున్సిపాలిటీని టీడీపీనే ఏర్పాటు చేసినట్లు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీయే పరిపాలిస్తున్నట్లు, నగరంలో జరిగిన అభివృద్ధి మొత్తం టీడీపీ వల్లే జరిగినట్లు బిల్డప్ ఇచ్చుకోవడం సరికాదని రవిబాబు అన్నారు. మున్సిపాలిటీకి ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ దానిని ఒక పార్టీకి చెందిన కార్యక్రమంగా చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఉత్సవం రాజకీయ కార్యక్రమం కాదని, నగర చరిత్రకు సంబంధించిన వేడుక అని రవిబాబు అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నగర ప్రముఖులు, ప్రజలను కలుపుకొని ఉత్సవాలను నిర్వహించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. ఒంగోలు మున్సిపల్ చరిత్రలో టీడీపీ ఒకసారి మాత్రమే మున్సిపల్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్లపాటు పరిపాలించిందని రవిబాబు పేర్కొన్నారు. ఆ ఐదేళ్ల పాలనను మినహాయిస్తే 150 ఏళ్ల మున్సిపల్ చరిత్ర మొత్తాన్ని టీడీపీతో ముడిపెట్టి ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. మున్సిపల్ ఎన్నికలు, పాలకవర్గాలు, వివిధ కాలాల్లో పనిచేసిన ప్రజాప్రతినిధుల పాత్రను పక్కన పెట్టి ప్రస్తుతం ఎమ్మెల్యే కేంద్రంగా కార్యక్రమాన్ని నిర్వహించడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పనులు..
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే నగరంలో హడావుడిగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని రవిబాబు ఆరోపించారు. గతంలో ఉన్న డివైడర్లను తొలగించి మళ్లీ కొత్తవి ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న నిర్మాణాలకు రంగులు వేయడం వంటి పనులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. నగరంలోని ప్రధాన సమస్యలైన డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మురుగునీటి నిల్వ, దోమల సమస్యలపై తగిన దృష్టి పెట్టడం లేదన్నారు. నగరంలోని మురికివాడలు, అంతర్గత ప్రాంతాల్లో కొత్త రహదారులు, డ్రైనేజీ పనులు చేపట్టకుండా ప్రధాన రహదారుల వద్ద మాత్రమే పనులు చేస్తున్నారని అన్నారు.
ఉన్నవాటిని తొలగించి కొత్తవి ఎందుకు..?
గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధి దీపాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి కొత్తగా లైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను వినియోగించకుండా వాటిని తొలగించి కొత్తగా నిర్మాణాలు చేపట్టడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనన్నారు. డివైడర్లను కూల్చి మళ్లీ నిర్మించడం, గోడలకు పదేపదే రంగులు వేయడం వంటి పనులతో అభివృద్ధి జరుగుతోందని ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. పనుల కంటే వాటి ప్రచారానికే అధికంగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
డివిజన్లలో అసమానతలపై ఆరోపణ...
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని డివిజన్లకు అధిక ప్రాధాన్యం, మరికొన్ని డివిజన్లకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని రవిబాబు పేర్కొన్నారు. ప్రజలందరికీ సమానంగా అభివృద్ధి పనులు అందాల్సి ఉండగా రాజకీయ ప్రాధాన్యతల ఆధారంగా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో ఒంగోలు నగర అధ్యక్షులు కఠారి శంకరరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్‌ఖాన్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, ఒంగోలు అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు, దేవరపల్లి కోటేశ్వరరావు, వెంకయ్య నాయుడు, మాల్యాద్రిరెడ్డి, పిగిలి శ్రీనివాసరావు, పెద్దిపోగు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


