ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా బూచేపల్లి వెంకాయమ్మ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. 2021 సెప్టెంబర్ 25న పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆమె నేటితో ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆమెను అధికారులు, సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రకాశం జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు.
రూ.112.70 కోట్లతో 2,231 పనులు
2021–22 నుంచి 2025–26 వరకు అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ.112.70 కోట్లు ఖర్చుచేసినట్లు ఆమె తెలిపారు. ఇందులో 1,089 పనులకు రూ.50 కోట్ల మేర చెల్లింపులు చేశామని, మరో 1,100 పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో ఉద్యోగ అవకాశాల కల్పనకు కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కారుణ్య నియామకాల ద్వారా 125 మందికి, పదోన్నతుల ద్వారా 150 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. ఐదేళ్ల పదవీకాలంలో తనకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, అధికారులు, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రతినిధిగా పనిచేసే అవకాశం కల్పించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఆమె వెంట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఉన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
నేటితో ఐదేళ్ల పదవీ కాలం పూర్తి
వెంకాయమ్మను సన్మానించిన జెడ్పీ అధికారులు, సిబ్బంది


