● ఖరీఫ్ పంటలపై ఆశలు
మార్కాపురం: గత రెండు మూడు నెలలుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు, రైతులకు ఉపశమనం కలిగించే వర్షాలు కురవడంతో ఖరీఫ్ పంటలపై ఆశలు పెరిగాయి. బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నం వరకూ జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాచర్లలో 46.2 మి.మీ, హనుమంతునిపాడులో 1 మీ.మీ వర్షం నమోదైంది. కొమరోలులో 30.2, గిద్దలూరులో 23.6, అర్ధవీడులో 28.4, మార్కాపురంలో 29.2, కంభంలో 30, దోర్నాలలో 30.8, త్రిపురాంతకం 36, పెద్దారవీడులో 25.6 మి.మీ, తర్లుపాడులో 21.4, పొదిలిలో 27.6, బేస్తవారపేటలో 23.8, యర్రగొండపాలెంలో 16, పుల్లలచెరువులో 12.4, సీఎస్‌పురంలో 8.8, కనిగిరిలో 7.4, వెలిగండ్లలో 6.4, పామూరులో 5.6, కొనకనమిట్లలో 4.2, పీసీపల్లిలో 3.6, హనుమంతునిపాడులో 1 మి.మీ వర్షం కురిసింది. సజ్జ, కంది, పత్తి, మిర్చి, జొన్న తదితర పంటలకు కొద్దిగా మేలుచేసినట్లయిందని పలువురు రైతులు తెలిపారు. మార్కాపురం పట్టణంలోని పలు వీధులు వర్షపునీటితో నిండిపోయాయి. రెండు మూడు నెలలుగా వర్షాలు లేకపోవడంతో పంటలు సాగుచేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కురిసిన వర్షం మెట్టపంటలకు జీవంపోసింది.


