పాత పథకానికి హడావుడి.. | - | Sakshi
Sakshi News home page

పాత పథకానికి హడావుడి..

Aug 29 2026 1:52 AM | Updated on Aug 29 2026 1:52 AM

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరైన అమృత్‌ 2.0 పథకానికి రెండేళ్ల తరువాత శిలాఫలకం ఇష్టారాజ్యంగా ట్రాఫిక్‌ మళ్లింపు అవస్థలు పడిన జనం యువగళం హామీలను ప్రస్తావించని లోకేష్‌

ఒంగోలు సబర్బన్‌: ఒంగోలు నగరానికి శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమృత్‌ 2.0 పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2024లో ఎన్నికల కోడ్‌ అడ్డురావటంతో పథకం అమలు ఆలస్యమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఆ పథకం ప్రస్తుతం టెండర్ల దశ పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రారంభించారు. దీంతో పాటు నగరంలో పలువురు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి మ..మ అనిపించారు.

సాగిల పడిన అధికార యంత్రాంగం..

రాష్ట్ర విద్యా శాఖ, ఐటీ మంత్రిగా సంబంధిత శాఖల అధికారులే ప్రొటోకాల్‌ పాటించాల్సి ఉంది. అలాంటిది ఒక రాష్ట్ర మంత్రికి భారీ స్థాయి ప్రొటోకాల్‌ను జిల్లా అధికారులు కేటాయించటాన్ని పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. తొలుత సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ర్యాడిసన్‌ హోటల్‌ ప్రారంభంతో మొదలైన లోకేష్‌ పర్యటన అత్యంత పేలవంగా సాగింది. ఇప్పటికే హోటల్‌ వ్యవహారం విషయానికి వచ్చేసరికి దేవదాయ, ధర్మాదాయ భూముల వివాదంలో కొట్టుమిట్టాడుతున్న చదలవాడలోని స్థలం లోకేష్‌ వచ్చి భూమి పూజ చేయటంతో దేవదాయ శాఖ భూముల విషయం వెలుగులోకి వచ్చింది. అధికార బలంతో ఉన్న నాయకుల వ్యవహారం కాబట్టి దేవదాయ శాఖ అధికారులు కూడా కిమ్మనకుండా ఉండిపోయారు.

ట్రాఫిక్‌ మళ్లింపుతో అవస్థలు పడిన జనం..

మంత్రి లోకేష్‌ పర్యటన సందర్భంగా పలు దార్లు మూసివేసి ట్రాఫిక్‌ను మళ్లించడంతో జనం అవస్థలు పడ్డారు. ఒంగోలు నుంచి త్రోవ గుంట బ్రిడ్జ్‌ రెండు వైపులా ఉండే సర్వీస్‌ రోడ్డులు బ్లాక్‌ చేశారు. అలాగే త్రోవగుంట ఊర్లో జనాన్ని సైతం వదల్లేదు. ఇంటికి వెళ్లాలన్నా పోలీసులు పట్టించుకోలేదు. చదలవాడ వెళ్ల దారిలో వాహనాల రాకపోకలను నిలిపేశారు. మంగమ్మ కళాశాల సెంటర్‌లో రోడ్డుకు అడ్డంగా ఆర్చి కట్టారు. సైకిళ్లను అడ్డంగా పెట్టి హైవేను బ్లాక్‌ చేశారు. కిమ్స్‌ ఆస్పత్రి నుంచి నగరంలోకి వచ్చే రహదారిని క్లోజ్‌ చేశారు. అటు వైపు వచ్చే వాహనాలను జాతీయ రహదారిపై వెళ్లి కొత్తపట్నం వంతెన దగ్గర నుంచి నగరంలోకి వచ్చేలా మళ్లించారు. ఆర్టీసీ బస్సులను సైతం దారి మళ్లించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

కనపడని కూటమి పార్టీల నాయకులు...

ఒంగోలు నగరంలో సాగిన లోకేష్‌ పర్యటనలో టీడీపీ కూటమి పార్టీలోని భాగస్వామ్య పార్టీలకు చెందిన నాయకుల ముఖాలు కనపడలేదు. ముఖ్య నాయకులు లోకేష్‌ పర్యటనలో కనుమరుగయ్యారు. అటు జనసేన పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కానీ, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు కానీ ఎవరూ దరిదాపుల్లో లేరు. ముఖ్యంగా ఆయా పార్టీల్లోని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల అనుచరులు మాత్రం అక్కడక్కడా కంటపడ్డారు. దీంతో కూటమి పార్టీలలోని లొసుగులు, అంతర్గత కుమ్ములాటలు మరోసారి బట్టబయలైనట్లయింది.

యువగళంలో వాక్కుల ఊసే లేదు...

2024 ఎన్నికలకు ముందు లోకేష్‌ జెట్‌ స్పీడ్‌ పాదయాత్ర చేపట్టాడు. ఆ పాదయాత్రలో లోకేష్‌ జిల్లాకు, ఒంగోలు నగరానికి నోరు పట్టనన్ని వాగ్దానాలు చేశాడు. అయితే లోకేష్‌ ఒంగోలు పర్యటనలో మాత్రం ఆ వాగ్దానాల ఊసే లేకుండా సాగింది. పబ్లిక్‌ మీటింగ్‌ పెడితే ఎక్కడ యువగళం వాగ్దానాలు ప్రజలు అడుగుతారేమోనని ఏమో కానీ పబ్లిక్‌ మీటింగ్‌ లేకుండానే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. అధికారంలోకి వచ్చి 27 నెలలు దాటుతున్నా పోతురాజు కాలువ ప్రస్థావన లేదు. ఇక అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పూర్తి చేస్తానన్న టిడ్కో ఇళ్ల సంగతి అటకెక్కింది. ఒంగోలు నగరానికి భూగర్భ డ్రైనేజీ వాగ్దానం భూమిలోనే పాతరేసేశారు. జిల్లాకు ఫార్మా హబ్‌ అసలు ప్రణాళికల్లోనే లేదు. ట్రిపుల్‌ ఐటీ కాలేజీ వ్యవహారం ప్రస్తావనే లేదంటే...ఇక ప్రజాధనాన్ని వృథా చేసి లోకేష్‌ ఒంగోలు నగరంలో చేసిన పర్యటనను కార్యకర్తల కోసం కాకుండా ఇంకేమనాలి అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

లోకేష్‌ సభకు వస్తేనే మస్టర్‌

శుక్రవారం చదలవాడ సమీపంలో జరిగిన ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తేనే ఉపాధి కూలీలకు ఈ రోజు మస్టర్‌ వేస్తామని ఉప్పుగుండూరు, నాగులుప్పలపాడు తోపాటు చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్‌ లు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా మంది కూలీలు అసలు ఉపాధి పని మస్టర్‌కు లోకేష్‌ సభకు సంబంధం ఏంటని కూలీలు ప్రశ్నించారు.

ప్రైవేటు కార్యక్రమానికి డ్వాక్రా మహిళలు

శుక్రవారం చదలవాడ సమీపంలో లోకేష్‌ కార్యక్రమం పూర్తిగా ప్రైవేటుపరమైన అంశం. దీనికి ప్రభుత్వ శాఖల్లోని అధికారులు అత్యుత్సాహం చూపించారు. గ్రామాల్లో ఆటోలు పెట్టి మరీ లోకేష్‌ సభకు రావాలని డ్వాక్రా మహిళల మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. అదేమంటే రుణాల మంజూరు, సీ్త్ర నిధి వంటి అంశాలు మా చేతుల్లో ఉంటాయి. మాట వినని గ్రూపులను గుర్తించుకోవాలని అన్నట్లు మహిళలు గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement