100కు పైగా గ్రామాలకు తాగునీరు బంద్ నెల రోజులుగా తాగునీరు లేక నోళ్లెండుతున్నా పట్టించుకోని అధికారులు నియోజకవర్గంలో 3 లక్షల మందిపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఇదీ
దర్శి: నెల రోజులుగా నియోజకవర్గంలో ప్రజలకు తాగు నీరు లేక గొంతెండి పోతుందని ఘోషిస్తున్నా ఇక్కడ పాలకులు, అధికారులకు కనీసం చీమకుట్టినట్లైనా ఉండటంలేదు. ఎన్‌ఏపీ రిజర్వాయర్ ను కాంట్రాక్ట్ పద్ధతిలో దక్కించుకున్న కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. తాము చేయలేమని అధికారులతో స్పష్టం చేసి లెటర్‌ను కూడా ఇచ్చారు. దీంతో తాగునీటి సరఫరాను అధికారులే చేపట్టాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ పనిచేసే వర్కర్‌లకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. వారు కూడా శనివారం నుంచి సమ్మెకు వెళ్లాలని సమాయత్తమవుతున్నారు. నీళ్లు వదలండని కాంట్రాక్ట్ వర్కర్‌లను ఆదేశిస్తే ఈ మురికి నీరు మేం వదలలేమని తెగేసి చెప్పినట్లు సమాచారం. బ్లీచింగ్ కానీ గ్యాస్ కానీ నెల రోజులుగా నిల్వ లేదు. పూర్తిగా అయిపోయిందని తాగునీటిని అలా ఎలా వదలాలని అధికారులను వర్కర్‌లు ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు సైతం డైలమాలో పడ్డారు.
ఎన్నికలు అయిపోతే ప్రజలకు చుక్కలే:
స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న తరుణంలోనే కనీసం తాగునీరు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటే ఇక తరువాత ఎన్నికలు అయిపోతే ప్రజలకు తాగునీటి విషయంలో చుక్కలు చూపిస్తారనేది ఇట్టే స్పష్టమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్‌ఏపీ రిజర్వాయర్‌ను అధికారులు, కాంట్రాక్టర్‌లు తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల కక్కుర్తితో కనీసం నీటిలో బ్లీచింగ్, క్లోరినేషన్ కూడా చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. అప్పటి నుంచి ప్రజలకు శుద్ది లేని నీటిని వారం, పదిరోజులకు ఒక సారి అరకొరగా అందించేవారు. అయితే ప్రస్తుతం పూర్తిగా తాగునీరు అందించడంలో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు శుద్ది నీరు అందించే ఎన్‌ఏపీ రిజర్వాయర్‌ను తమ ఆదాయవనరుగా మార్చుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టాల్సిన పనులు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి అప్పనంగా దోచుకుని తింటూ నియోజకవర్గ ప్రజలకు తీరని అన్యాయం చేశారు. ప్రస్తుతం నామినేషన్ పద్ధతుల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌లు కూడా పనులు చేయలేమని చేతులెత్తేస్తున్నారంటే పలు అనుమానాలకు తావిస్తోంది.
పేరున్న ప్రాజెక్ట్‌పై కూటమి కుట్రలు:
1983వ సంవత్సరంలో అప్పటి నెదర్లాండ్‌కు చెందిన ఇంజినీర్లు సాగర్ కాలువ పనులు చేస్తున్న తరుణంలో సాగర్ కెనాల్ నుంచి వచ్చే నీటిని స్టోరేజ్ చేసి సంవత్సరం మొత్తం ప్రతి రోజు రెండు లక్షల మందికి పైగా నీరందించేలా ఈ నెదర్లాండ్ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెండవ తాగునీటి ప్రాజెక్ట్‌గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి పొదిలి, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు కూడా తాగునీరు పైప్‌లైన్‌ల ద్వారా సరఫరా చేశారు. ఆ తరువాత టీడీపీ హయాంలో కాంట్రాక్టర్‌లు ధనదాహంతో పనులు సక్రమంగా చేయించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ శిథిలావస్థకు చేరింది.


