ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొక్కుబడిగా సమావేశాలు తల్లిదండ్రుల స్పందన అంతంత మాత్రమే అరకొర నిధులతో తిప్పలు పడిన హెచ్‌ఎంలు పరీక్షలు నిర్వహించకుండానే ప్రోగ్రెస్ కార్డులు లీప్ యాప్‌పై గందరగోళం వేదికలపై టీడీపీ నేతల హంగామా సమావేశాల వద్ద పోలీస్ బందోబస్తు
ఒంగోలు సిటీ:
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్స్ మీట్ (పీటీఎం) 4.0 మొక్కుబడిగా ముగిసింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. ప్రభుత్వ ప్రచారానికే పరిమితమైన ఈ కార్యక్రమం నిర్వహణలో అరకొర నిధులు విడుదల కావడంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. మరోవైపు పరీక్షలు నిర్వహించకుండానే ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేయడం, లీప్ యాప్ డౌన్‌లోడ్‌పై ఒత్తిడి తల్లిదండ్రులను అయోమయానికి గురిచేశాయి.
పరీక్షలు నిర్వహించకుండానే
ప్రోగ్రెస్ కార్డులా?
పాఠశాలలు పునఃప్రారంభమై ఇంకా 50 రోజులు దాటలేదు. విద్యార్థులకు ఇప్పటి వరకూ ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. ఎలాంటి పరీక్షలు జరపకుండానే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు (సమగ్ర ప్రగతి పత్రాలు) పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. ప్రగతి పత్రాల్లో మార్కుల నమోదు లేకపోవడంతో వాటిని చూసిన తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఈ విషయంపై కొన్ని చోట్ల పాఠశాల సిబ్బందిని నిలదీశారు.
నిధులు సరిపోక హెచ్‌ఎంలకు భారంగా..
ప్రకాశం జిల్లాలో 1,556, మార్కాపురం జిల్లాలో 1,405 ప్రభుత్వ పాఠశాలలు కలిపి మొత్తం 2,961 పాఠశాలల్లో మెగా పీటీఎం–4.0ను ఘనంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. అయితే కార్యక్రమ నిర్వహణకు కేటాయించిన నిధులు సరిపోకపోవడంతో అనేక పాఠశాలల్లో ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొంటున్నారు. కొన్ని పాఠశాలల ఖాతాలకు కేటాయించిన మొత్తం కూడా పూర్తిగా జమ కాకపోవడంతో, కార్యక్రమ నిర్వహణ కోసం ప్రధానోపాధ్యాయులు సొంత నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 లోపు విద్యార్థులుంటే రూ.900, 30–200 మంది విద్యార్థులుంటే రూ.2550, 250 మంది ఉంటే రూ.4 వేలు, వెయ్యి మంది ఉంటే రూ.6,750, వెయ్యి మందిపై నుంటే రూ.9 వేలు విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రాథమిక పాఠశాలల్లో సాధారణంగా 100 మంది లోపే ఉంటారు. అలాంటి చోట ప్రభుత్వం ఇచ్చిన రూ.2,250లతో కుర్చీలు, టెంట్లు, గెస్ట్‌లకు శాలువాలు, తల్లిదండ్రులకు ఆటల పోటీలు పెట్టి బహుమతులు, భోజనానికి ప్లేట్లు, గ్లాసులకు ఖర్చు హెచ్‌ఎంలకు తడిసి మోపడైంది. అదనపు ఖర్చును ఉపాధ్యాయులే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీడీపీ నాయకులకు చోటు
గిద్దలూరు నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన మెగా పీటీఎం కార్యక్రమంలో టీడీపీ నాయకులకు చోటు కల్పించారు. బేస్తవారిపేటలోని జెడ్పీ బాలుర హైస్కూల్‌లో జరిగిన పీటీఎం కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు, సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు, కంభం మార్కెట్‌యార్డ్ చైర్మన్‌లకు చోటు కల్పించారు. టీడీపీ సభలాగా మార్చేశారు.
లీప్ యాప్‌పై ఒత్తిడి
ప్రతి తల్లి తండ్రి వద్ద స్మార్ట్‌ఫోన్ ఉండాలని, అందులో లీప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించడంతో స్మార్ట్‌ఫోన్ లేని కుటుంబాలు, సాంకేతిక పరిజ్ఞానం తెలియని పెద్దలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. యాప్ వినియోగంపై తగిన అవగాహన లేకపోవడంతో పలుచోట్ల అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.


