విద్యా సంస్థల బంద్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

విద్యా సంస్థల బంద్‌ విజయవంతం

Jul 25 2026 2:05 AM | Updated on Jul 25 2026 2:05 AM

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకుంటే ఢిల్లీ ముట్టడి విద్యార్థి సంఘాల నాయకులు

ఒంగోలు సిటీ: దేశవ్యాప్తంగా 155 పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీకి కారకులైన, ఏడు కోట్ల మంది విద్యార్థుల జీవితాలు ధ్వంసం అయ్యేందుకు, దాదాపు 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారకుడైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయకపోతే ఢిల్లీని ముట్టడిస్తామని విద్యార్థి సంఘాల నేతలు వెల్లడించారు. నీట్‌ పేపర్‌ లీకేజీకి కారుకులైన ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని కోరుతూ 20వ తేదీ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులు శాంతియుత ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తన పోలీసు బలగాల చేత ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అత్యంత కిరాతకంగా భాష్ప వాయువు వంటి వాటిని ఉపయోగిస్తూ దారుణంగా లాఠీచార్జి చేశారు. దీన్ని నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో రెండు రోజుల ముందు నుంచే విద్యార్థి సంఘాల నేతలు ప్రైవేట్‌ విద్యాసంస్థల వారికి నోటీసులు అందించారు. 90 శాతం ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్‌కు అంగీకరించాయి. 24వ తేదీ శుక్రవారం ఒంగోలు నగరంలో విద్యార్థి సంఘాల నేతలు ముందుగా దామచర్ల సక్కుబాయమ్మ పాలిటెక్నిక్‌ కళాశాల, డిగ్రీ కళాశాల, ఏబీఎం జూనియర్‌ కళాశాల, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ, మిగిలిన ప్రభుత్వ విద్యా సంస్థలను దగ్గరుండి మూయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు, పోలీసుల అత్యుత్సాహం వల్ల బంద్‌ను జరగకుండా చేయాలని చూసినా జిల్లా వ్యాప్తంగా బంద్‌ విజయవంతం అయింది. అనంతరం విద్యార్థి యువజన సంఘాల నేతలు మాట్లాడుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయటం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం వలన మొత్తం విద్యా వ్యవస్థ నాశనమైపోయిందన్నారు. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ నేడు మాట తప్పారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని పార్లమెంట్‌లో కీలకమైన బిల్లుల్ని ఆమోదించుకుంటున్నారు తప్ప విద్యార్థులు, యువజనుల గురించి ఆలోచించే పరిస్థితి లేదన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్‌ చుక్‌ విద్యార్థులకు మద్దతుగా 23 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ఆయనతో చర్చించేందుకు కూడా భారత ప్రభుత్వానికి తీరిక లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఆలోచించి నీట్‌ ప్రవేశ పరీక్షను రాష్ట్రాల పరిధిలోకి తీసుకురావాలని, జాతీయ స్థాయి ప్రశ్న పత్రాల లీకేజీలపై పార్లమెంట్లో చర్చించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రద్దుచేసి, ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌.రాజశేఖర్‌, ఏపీ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్‌, భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరాస్వామి, అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు ఆర్‌.కరుణానిధి, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు ఆర్‌.మరియబాబు, రాకేష్‌, కిరణ్‌, నితీష్‌ కుమార్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి కండల రమాదేవి, జిల్లా నాయకులు రాజ్యలక్ష్మి, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి బీ రఘురామ్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం రమేష్‌, శ్రీకాంత్‌, అభిమన్యు, చారి, సంపత్‌, పీడీఎస్‌యూ నాయకులు సోమేశ్‌, అవినాష్‌, సచిన్‌, విద్యార్థి యువజన జేఏసీ నాయకులు రాజీవ్‌, ఈస్టర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement