● డాక్యుమెంట్ రైటర్లు పెన్‌డౌన్‌తో
రిజిస్ట్రేషన్ ఆదాయానికి గండి
ఒంగోలు సబర్బన్: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు సమ్మెలోకి వెళ్లటంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆస్తుల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. డాక్యుమెంట్ రైటర్లు సోమవారం ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలన్నింటినీ నిలిపేశారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోయాయి. పలుచోట్ల డాక్యుమెంట్ల రైటర్లు తమ కార్యాలయాల వద్దే నల్లరిబ్లన్లతో నిరసన తెలిపారు. ఒంగోలులో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. డాక్యుమెంట్ రైటర్ల నిరసన కార్యక్రమం ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోపర్తి హరిబాబు మాట్లాడుతూ డాక్యుమెంట్ రైటర్స్ వృత్తికి భంగం కలిగించొద్దని నినదించారు. జీవో–396కు వ్యతిరేకంగా ఈ నెల 31 వరకు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అసోసియేషన్ నాయకుడు డి.సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ విధానాల వల్ల జిల్లా వ్యాప్తంగా 18 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆసరాగా చేసుకొని పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అనుబంధ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పి. నరసింహారావు. ఎం.నాగేశ్వరరావు, గోపిశెట్టి శ్రీనివాసరావు. డి.సురేష్ మోహన్, షేక్ ఖాసిం, బి.నారాయణ, ఏ.శ్రీనివాస రెడ్డి, బత్తుల భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛంతో పాటు జ్ఞాపికను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజా జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇద్దరూ కొద్దిసేపు పలు అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.


