బ్రహ్మకుండం.. ఉనికికే గండం! | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మకుండం.. ఉనికికే గండం!

Jul 24 2026 2:21 AM | Updated on Jul 24 2026 2:21 AM

బల్లికురవ:

దేవుడి పేరుతో నీచ రాజకీయాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే బాబు సర్కారు.. ఆలయాల ఉనికికే ముప్పు వాటిల్లుతున్నా లేశమంతైనా స్పందించకపోవడంపై భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో పాలకుల అండదండలతో క్వారీ మాఫియా ఇష్టారాజ్యంగా రెచ్చిపోతుండటంతో 12వ శతాబ్దపు చోళరాజుల కాలం నాటి మహిమాన్విత క్షేత్రాలకు ముప్పు ఏర్పడింది. గ్రానైట్‌ వ్యర్థాల డంపింగ్‌తో ఆలయాలు కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించినా స్పందించే నాథుడే కరువయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బల్లికురవ మండలంలోని కొణిదెన, నక్కబొక్కలపాడు పరిధిలో ఎంతో చరిత్ర కలిగిన బ్రహ్మకుండం, ఈర్లకొండపై స్వయంభువుగా వెలసిన ఈర్ల గంగమ్మ ఆలయాల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కొండపై భాగంలో ఎస్‌ఆర్‌ క్వారీ నిర్వాహకులు రెండేళ్లుగా గ్రానైట్‌ వృథా రాళ్లను ఇష్టారాజ్యంగా కిందికి దొర్లిస్తున్నారు. రాళ్ల దెబ్బకు ఆలయాలు, విగ్రహాలను దుమ్ము కమ్మేస్తోంది. ఏ క్షణాన తమ మీద రాళ్లు పడతాయోనని భక్తులు ప్రాణగుప్పిట్లో పెట్టుకుని పూజలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రశ్నించిన గ్రామస్తుల పట్ల శ్రీఆలయాలు మా లీజు స్థలంలో ఉన్నాయి, ‘అంతా మా ఇష్టం’ అంటూ క్వారీ నిర్వాహకులు దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇటీవలే బ్రహ్మకుండం వద్ద భక్తుల సహకారంతో లక్ష్మీనారాయణుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయస్వామి, పార్వతీ పరమేశ్వరులు తదితర విగ్రహాలను ప్రతిష్టించి ఆధ్యాత్మిక వనంగా తీర్చిదిద్దారు. దసరా, కార్తీకమాసాల్లో ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తుల భద్రతను సైతం కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. క్వారీ మాఫియాకు వత్తాసు పలుకుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది. వృథా రాళ్లు పడకుండా ఆపకపోతే భవిష్యత్తులో ఈ ఆలయాలు పూర్తిగా కనుమరుగవ్వడం ఖాయం. పాలకుల నిర్లక్ష్యంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భగవంతుడికి అన్యాయం జరిగితే సహించేది లేదని, వెంటనే క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోకపోతే కరపత్రాల పంపిణీతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర యువమోర్చా నేత కే.శ్రీరామ్‌ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement