మార్కాపురం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులను బాబు ప్రభుత్వం తీవ్రంగా వంచిస్తోందని ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజల త్యాగాలను ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని సీనియర్ న్యాయవాది సయ్యద్ జావేద్ అన్వర్, వెలిగొండ నిర్వాసితుల సంఘం కోకన్వీనర్ దగ్గుబాటి సోమయ్య ధ్వజమెత్తారు. కటాఫ్ తేదీని 2019 నుంచి 2026కు పెంచాలని, అర్హులైన వారందరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని అందించాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వాసితులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ దీక్షా శిబిరంలో నేతలు మాట్లాడుతూ.. ఎప్పుడో 2016 సంవత్సరంలో నిర్ణయించిన ప్యాకేజీని పదేళ్ల తర్వాత 2026లో నిర్వాసితుల నెత్తిన రుద్దాలని చూడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 సెప్టెంబరు నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులందరినీ మేజర్లుగా పరిగణించి, 2013 భూసేకరణ చట్టం ప్రకారం వారందరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మా బాలనాగయ్య, రైతు సంఘం నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, రాజేశ్వరరెడ్డి, హనుమంతారెడ్డి, ఎల్లయ్య, రామకృష్ణ, శశీంద్ర, ఫకీరయ్య తదితరులు పాల్గొన్నారు.
యర్రగొండపాలెం: మండలంలోని బోయలపల్లెలో ఆత్మానంద అవధూత స్వామి ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఈ నెల 26న రాష్ట్రస్థాయి పాలపండ్ల ఎడ్ల (6 పండ్ల లోపు) పందాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పందాల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేల చొప్పున బహుమతులు ప్రదానం చేయనున్నారు. తొలిఏకాదశిని పురస్కరించుకుని 25న స్వామివారికి విశేష పూజలు, రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, 26న ఎడ్ల పందాలు, 27న రాత్రి గురుపూజ కన్నులపండువగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.
మార్కాపురం: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక జీజీహెచ్‌లో 20 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రామచంద్రరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటిలో 10 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. 100 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం ఉందని, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కలిపి కరోనా కేసులు 32కు చేరడంతో జీజీహెచ్ సిబ్బంది ఇప్పటికే మాస్కులు ధరించి విధులకు హాజరవుతున్నారని, ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూపరింటెండెంట్ సూచించారు. తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
బాబు సర్కారు తీరుపై భగ్గుమన్న ప్రజా సంఘాలు
2016 నాటి ప్యాకేజీని 2026లో అంటగడతారా అంటూ నిలదీత
మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న దీక్షలు


