రాచర్ల: మండల కేంద్రమైన రాచర్లలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. స్థానిక బస్‌స్టాండ్ సెంటర్‌లో నివాసముండే యల్లా రంగస్వామి (48)ఆయన బుధవారం రాత్రి భోజనం చేసి ఇంట్లోని రెండో అంతస్తులోకి వెళ్లాడు. అర్ధరాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. ఉదయం భార్య నాగమణి గమనించి స్థానికులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఎస్సై ఎం.శివ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గిద్దలూరు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి తల్లి, భార్య, చదువుకుంటున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆయన బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కందుకూరు రూరల్: ఈ నెల 24 నుంచి 26 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ టోర్నమెంట్‌కు కందుకూరుకు చెందిన పి.అఖిల్ రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు తైక్వాండో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే అబ్దుల్ సలాం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఎంపికై న అఖిల్‌ను కందుకూరు డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా క్రీడారంగానికి ఇది గర్వకారణమని, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో చైర్మన్ గోనుగుంట వెంకటేశ్వర్లు (తిమోతి) తదితరులు పాల్గొన్నారు.


