ఒంగోలు సిటీ: విజయనగరంలో ఈ నెల 17 నుంచి నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్–23 జోనల్ టీ20 క్రికెట్ టోర్నీలో ప్రకాశం జిల్లా జట్టు అజేయంగా నిలిచి టైటిల్ కై వసం చేసుకుంది. బరిలోకి దిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థులను చిత్తుచేసి సగర్వంగా విజేతగా నిలిచింది. తొలి మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్‌పై ప్రకాశం ఘనవిజయం సాధించింది. నార్త్‌జోన్ 172/7 స్కోరు చేయగా.. ప్రకాశం 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆనంద్ (56) హాఫ్ సెంచరీతో రాణించాడు. రెండో మ్యాచ్‌లో తూర్పుగోదావరిపై ప్రకాశం 32 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసి 195/10 పరుగులు సాధించింది. విష్ణుదత్త (20 బంతుల్లో 55) వీరవిహారం చేశాడు. అనంతరం ప్రత్యర్థి జట్టును 163 పరుగులకే కట్టడి చేసింది. మూడో మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్‌జోన్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని ప్రకాశం జట్టు 16.2 ఓవర్లలోనే అధిగమించింది. బౌలర్లు ఎన్.వి.పవన్ కుమార్, పార్థసారథి రెండేసి వికెట్లతో సత్తా చాటారు. నాలుగో మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ ఇచ్చిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రకాశం జట్టు కేవలం 16.1 ఓవర్లలోనే ఛేదించింది. విష్ణుదత్త (35 బంతుల్లో 75) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐదో మ్యాచ్‌లో అనంతపురం టీమ్‌పై ప్రకాశం బ్యాటర్లు ప్రతాపం చూపారు. 196 పరుగుల లక్ష్యాన్ని అభినవ్ (90), సి.పి.వెంకటేష్ (61) అద్భుత బ్యాటింగ్‌తో 19.2 ఓవర్లలో ఛేదించారు. బౌలర్ పార్థసారథి టోర్నీ ఆసాంతం అదరగొట్టాడు. విజేతగా నిలిచిన జట్టును ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ (పీడీసీఏ) అధ్యక్ష, కార్యదర్శులు నవీన్ కుమార్, కారుసాల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ బొచ్చు శ్రీనివాసరావు, ట్రెజరర్ హనుమంతరావు తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.
అండర్–23 జోనల్ పోటీల్లో అన్ని మ్యాచ్‌ల్లో విజయ కేతనం


