గుండె చెమ్మ! | - | Sakshi
Sakshi News home page

గుండె చెమ్మ!

Jun 5 2026 4:47 AM | Updated on Jun 5 2026 4:47 AM

ఆశల దీపాలను ఆర్పేసిన కందులూరు కుంట నిన్నటిదాకా సందడిగా ఉన్న ఇళ్లలో అలముకున్న విషాదం కన్నబిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల కన్నీటి వ్యథ మొదట భర్తను.. ఇప్పుడు కుమారుడిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన నాగరాజ ప్రాణాలు తీసిన అక్రమ మట్టి తవ్వకం

చెరువుకొమ్మ..

పిల్లల నవ్వులు.. సందడితో కళకళలాడిన ఆ ఇళ్లు ఇప్పుడు కన్నీటి వాకిళ్లుగా మారాయి. తమ బిడ్డలు బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని కన్న కలలు కళ్లముందే కూలిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు ప్రతీ హృదయాన్ని కదిలిస్తున్నాయి. భర్తను కోల్పోయి.. కొడుకే జీవనాధారంగా బతికిన ఓ తల్లి, ఇద్దరు కుమారులే లోకంగా భావించిన మరో దంపతులు, పేదరికంతో పోరాడుతూ బిడ్డను చదివించాలనుకున్న ఇంకో కుటుంబం... ఇలా మూడు కుటుంబాల ఆశల దీపాలను కందులూరుకుంట ఒక్కసారిగా ఆర్పేసింది. చెరువుకొమ్ముపాలెం అంతా కన్నీటి సంద్రమైంది. గ్రామ వీధుల్లో నిశ్శబ్దం అలముకుంది. ఎవరిని పలకరించినా కళ్లలో నీళ్లు, గుండెల్లో బాధ మాత్రమే కనిపిస్తోంది. ప్రతి వీధీ ఓ కన్నీటి గాథగా మారింది

ఒంగోలు టౌన్‌: ఒంగోలు నగరపాలక సంస్థలోని చెరువుకొమ్ముపాలేనికి చెందిన కరేటి కళ్యాణ చక్రవర్తి, లక్ష్మీజానకి దంపతులకు ఇద్దరు కుమారులు. ఇద్దర్నీ బాగా చదివించాలన్నది భార్యభర్తల లక్ష్యం. కళ్యాణ చక్రవర్తి ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తూ ఇంటి వద్ద ఆర్‌ఎంపీగా వైద్యం చేస్తున్నాడు. లక్ష్మీజానకి కూడా ఒంగోలులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. పెద్దోడు అభిరామ్‌ ఈ ఏడాది 8వ తరగతి పూర్తి చేసి 9కి వచ్చాడు. చిన్నోడు సుశాంత్‌ ఇప్పుడు 7వ తరగతిలో చేరాడు. కష్టపడి సంపాదించి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న వారి తల్లిదండ్రుల కలలు కల్లలయ్యాయి. గురువారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు పిల్లలు నీటమునిగి చనిపోయారు. ఒకే దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు చనిపోవడంతో ఆ దంపతులు కోలుకోలేకపోతున్నారు. నిన్నటి దాకా సందడి చేసిన పిల్లలు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడంతో ఆ ఇల్లు బోసిపోయింది.

నాడు భర్త.. నేడు కుమారుడు...

ఇక పొదిలి నాగరాజది మరో కన్నీటి వ్యథ. కళ్యాణ చక్రవర్తి చెల్లైలెన నాగరాజకు 13 ఏళ్ల క్రితం పొదిలి రవితో వివాహం జరిగింది. వారికి ఒక బాబు పుట్టాడు. సంతోషంగా ఉన్న సమయంలో విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదంలో రవి దుర్మరణం పాలయ్యాడు. ఎన్నో కలలతో అత్తాగారింట అడుగు పెట్టిన నాగరాజ.. బిడ్డతో పుట్టింటికి చేరింది. ఇప్పుడిప్పుడే భర్తను కోల్పోయిన విషాదం నుంచి తేరుకుంటోంది. ఒంగోలులోని ఒక ప్రైవేటు స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కుమారుడు చిన్ను కోసం ఒంగోలులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పనికి చేరింది. కందులూరు కుంటలో ఈతకు వెళ్లిన చిన్ను కూడా చనిపోవడంతో ఆమె అల్లాడిపోయింది. అటు భర్తను కోల్పోయి.. ఇటు కుమారుడిని కోల్పోయిన నాగరాజ.. ఇక ఎవరి కోసం తాను బతకాలంటూ రోదిస్తున్న తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.

పేదింట పెను విషాదం...

నిరుపేద యానాది కుటుంబానికి చెందిన ఇల్లా మాలయ్య బేల్దారి పనులకు వెళ్లి భార్యాబిడ్డల్ని పోషించుకుంటున్నాడు. అతనికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు కూడా తండ్రికి తోడుగా పనులకు వెళ్తున్నాడు. సమీపంలోని తుఫాను పునరావాస కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలలో రెండో కుమారుడు దినేష్‌ ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ ప్రమాదంలో దినేష్‌ మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

ప్రాణాలు తీసిన మట్టి తవ్వకం...

మట్టి తవ్వకం వలనే నలుగురు పిల్లల ప్రాణాలు గాలిలో కలసిపోయాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. 15 ఏళ్ల క్రితం హైవే పనుల కోసం మట్టి తరలించేందుకని ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తి 6 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా 15 నుంచి 20 అడుగుల లోతు వరకు గుంత తవ్వి మట్టి తరలించాడు. ఆ తర్వాత దాన్ని అలాగే వదిలిపెట్టాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement