పేదల హక్కు జకాత్...
కనిగిరి రూరల్:
ముస్లింల పవిత్ర రంజాన్ మాసం చివరి దశకు చేరుకుంది. రంజాన్ నెలలో 26 రోజుల కఠోర ఉపవాస దీక్షలు పూర్తయిన తర్వాత ఆఖరి మూడు రోజులకు ముందు వచ్చే షబ్–ఏ ఖదర్ (లైలతుల్ ఖదర్)ను సోమవారం ముస్లింలు అత్యంత నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. రాత్రి మసీదుల్లో ప్రత్యేక నమాజులు, ఆరాధనలు, ప్రార్థనలు చేసి అల్లాహ్ అనుగ్రహం కోసం వేడుకుంటారు. షబ్ –ఏ–ఖదర్ తర్వాత ఆఖరి మూడు రోజుల ఉపవాస దీక్షలు (సతామీ) ప్రారంభమవుతాయి. రంజాన్ నెల ప్రారంభం నుంచి ఉపవాస దీక్షలు ఉండలేని వారు ఆఖరి మూడు రోజులు మాత్రం తప్పకుండా ఆచరిస్తారు.
ఎతికాఫ్ ఇలా...
ఎతికాఫ్ (తపోనిష్ట)తో అల్లాహ్ ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు ఇతరులకు సమస్యగా ఉండకూడదని మసీదులోని ఓ మూలలో డేరా (పర్దా) ఏర్పరుచుకుంటారు. మల, మూత్ర విసర్జన (శుద్ధి, స్నానం) వజూ సమయాల్లోనే ‘పర్దా’లో నుంచి బయటకువస్తారు. మిగతా సమయం అంతా దైవస్మరణలో ఖురాన్ చదువుతూ, సున్నత్ నమాజులు చదువుతూ గడపుతారు. సీ్త్రలు ఇంట్లోనే ఓ ప్రత్యేక గది ఏర్పరుచుకుని ఎతికాఫ్ చేస్తారు. ఇఫ్తార్ సమయం కంటే ముందు 12 రకాతులు తహజూద్ నమాజ్ చదవాలి. ఆ సమయంలో ‘సజ్దా’ పద్ధతిలో దువా చేస్తే అల్లాహ్ అత్యంత సమీపం నుంచి వారి మొర వింటారు. కుటుంబం యోగక్షేమాలతో పాటు బంధుమిత్రులు, సర్వమానవాళి సంక్షేమం కోరుతూ దువా చేయడం ఉత్తమం. అలా చేస్తే అల్లాహ్ అనుగ్రహం లభిస్తోందని మౌలీలు, ముఫ్తిలు తెలిపారు. రంజాన్ మాసం చివరి పది రోజుల్లో కనీసం ఒకరోజైనా సున్నతే మౌఖిదా ఎతికాఫ్ పాటించాలి.
ఎతీకాఫ్ నియ్యత్ ఇలా...
నవాయితు అన్ బిస్మిల్లాహి, తవక్కల్‌తు వలైహీ దఖల్‌తూ వనవాయితూ బిసున్నతిల్ ఎతికాఫ్ (ఎతికాఫ్‌కి నియ్యత్) చదివి ముస్లింలు ఎతికాఫ్ ఆచరిస్తారు. అల్లాహ్ కోసం అన్నింటిని త్యజించి, దైవ సన్నిధికి వెళ్లి ఆధ్యాత్మికతలో విలీనమై కష్టాలు, బాధలు, సమస్యలు చెప్పుకుంటే అల్లాహ్ వారిపై అత్యంత కరుణ చూపి వారి మొరను దగ్గర నుంచి అల్లాహ్ ఆలకిస్తారని ముస్లింల విశ్వాసం.
నేడు షబ్–ఏ–ఖదర్
రంజాన్ నెల చివరి మూడు రోజుల దీక్షలు (సతామీ) షురూ
నియమ నిష్టలతో తాఖ్‌రాత్‌లు
మసీదుల్లో కొనసాగుతున్న ఎతీకాఫ్ దీక్షలు
ఇస్లాంకు ఉన్న ఐదు మూల స్తంభాలలో జకాత్ ఒకటి, ఇది ఆరాధనలో రెండో విధి. ఇస్లాం పవిత్ర గ్రంథంలో జకాత్ గురించి ప్రస్తావన కనీసం 32 సార్లు ఉంది. దీని బట్టి జకాత్‌కు ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమవుతోంది. ఇది పేదల హక్కు. అవసరార్థులకు జకాత్ చెల్లించే సదాచారుల కోసం దేవుని వద్ద ప్రతిఫలం సిద్ధంగా ఉంటుంది. ప్రతి ముస్లిం తన సంపాదనలో రెండున్నర శాతం పేదలకివ్వాలన్నది జకాత్ ఉద్దేశం. నమాజ్ వలే ఇది కూడా తప్పనిసరి నియమం. ఇస్లాంను ఆచరించే వారు దీనిని విస్మరించరాదు.


