● విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల మెరుపుదాడి, కేసు నమోదు
పొదిలి రూరల్: మండలంలోని ఏలూరు పంచాయతీలో ఏలూరు, నల్లారెడ్డివారిపాలెంలో శనివారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఒక ప్రైవేటు గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన పలు గ్యాస్ కంపెనీలకు సంబంధించిన కమర్షియల్ సిలిండర్లు, గృహావసర సిలిండర్లను రెండు మోటార్లతో రీఫిల్ చేస్తున్నట్లు గుర్తించారు. ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు 55 డొమెస్టిక్ సిలిండర్లు, 41 కమర్షియల్ సిలిండర్లు కలిపి మొత్తం 96 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రాఘవరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు చెప్పారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ప్రజల నుంచి సేకరించి కమర్షియల్‌కు షిఫ్టు చేిసే రెండు మోటార్లు, మిషన్, అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎక్కడైనా గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను స్థానిక మహిళలు అడ్డుకోగా, అధికారులు జరిగిన విషయాన్ని వారికి వివరించారు. దీంతో సమస్య సులభంగా పరిష్కారమైంది. దాడుల్లో డీటీ డేవిడ్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.


