వేనూతల కాటమరాజుస్వామి మూలవిరాట్
తిరునాళ్ల సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు
● తిరునాళ్లకు ముస్తాబైన దేవాలయం
పెద్దారవీడు: మండలంలోని గుండంచర్ల పంచాయతీ సమీపంలో నల్లమల అడవిలో వెలసిన పురాతనమైన పుణ్యక్షేత్రం వేనూతల కాటమరాజుస్వామి, గంగాభవానీ ఆలయ తిరునాళ్లను ఈ నెల 18వ తేదీ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. స్వామి, అమ్మవారిని భక్తులు దర్శించుకునేందుకు భారీగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఉగాది పండుగకు ముందు రోజు యాదవులు గ్రామాల్లో బొల్లావులను ఊరేగించుకుంటూ కాటమరాజుస్వామి దేవాలయం వద్దకు చేరుకుంటారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
బొల్లావు నిర్మాణం...
బొల్లావును యాదవుల ఇలవేల్పుగా ఆరాధించి పూజిస్తారు. రెండున్నర అడుగుల ఎత్తులో తేలికై న కలపతో దీనిని తయారు చేస్తారు. ఎరుపు రంగుతో అందంగా తీర్చిదిద్దుతారు. రెండు తొడలపై ఆంజనేయస్వామి, గరుత్మంతుడు, డొక్కకు సింహ తలాటం, వీపున నాగబంధం, మూపురం (చెండు)కు ఇరువైపుల శంకు, చక్రాలు, నొసటన గాంభీర్యాన్ని, అందాన్ని చేకూరుస్తాయి. కొమ్ముకు వెండి గొడుగులు, చెవులు, మెడకు ఆభరణాలు వీరతాళ్లు అలంకరిస్తారు.
ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు...
18వ తేదీ జరిగే కాటమరాజుస్వామి తిరునాళ్లకు మార్కాపురం డిపో వారు మార్కాపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం నుంచి, గిద్దలూరు డిపో నుంచి వయా మాగుటూరు మీదుగా దేవాలయం వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


