యర్రగొండపాలెం: మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు వెన్నులో వణకుపుడుతుందని, ఆయన తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ వెన్నుపోటు పొడిచే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని మొగుళ్లపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన గ్రామ పంచాయతీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి నాయకులు మోడీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఒక వర్గం అయితే, లోకేష్ మరో వర్గంగా యువ నాయకత్వం నడుపుతున్నాడని, ఆయన కళ్లు సీఎం కుర్చీపై పడిందన్నారు. ఈ నేపథ్యంలో తండ్రి చంద్రబాబును గద్దె దించి లోకేష్ ఆ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే కూటమి నాయకుల్లో అంతర్గత కుమ్ములాట మొదలైందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అరాచక కూటమి ప్రభుత్వం కాలకూటమి లాంటిదని, ఇది పతనం కావడం ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీకి 11 సీట్లు వచ్చినా, 40 శాతం ఓట్లు పోలైనా ఓకే అజెండాతో ముందుకు వెళుతుందని, ఒంటరిగానే పోటీ చేసే సత్తా ఉన్న పార్టీ పేర్కొన్నారు. అటువంటి ధమ్ము, ధైర్యం కూటమి నాయకులకు లేదని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజల అభిష్టం మేరకు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ప్రజల హర్షధ్వనుల మధ్య తాటిపర్తి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంటే కూటమి నాయకుల దృష్టిలో మనుషులు కాదని, వారు అధికారంలో ఉన్న సమయంలోనే వారిపై దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కారంచేడు, చుండూరు, నీరుకొండ, పిన్నెల్లి ఘటనలే అందుకు ఉదాహరణలన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే దళితులు ఊచకోతలకు గురవుతారన్న సత్యాన్ని ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలే రుజువు చేస్తున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ జగనన్న పరితపిస్తుంటారని, ఆ మాటలు చంద్రబాబు నోటితో ఎప్పుడూ వినలేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జనరల్ సెక్రటరీ మూడమంచు బాలగురవయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, వివిధ విభాగాల నాయకులు యండ్రపల్లి సుబ్బారావు, ఆర్.అరుణాబాయి, పి.రాములు నాయక్, ఆవుల వీరకోటిరెడ్డి, ఆవుల రమణారెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.
కూటమి నాయకుల్లో అంతర్గత కుమ్ములాట
ఒంటరిగా పోటీచేసే దమ్ము, ధైర్యం లేని కూటమి నాయకులు
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్


