ఒంగోలు టౌన్: సింగరాయకొండ చైతన్య కోచింగ్ సెంటర్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన 6వ తరగతి విద్యార్థి సయ్యద్ తౌషిక్ హత్యకు గురైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఒంగోలు సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తౌషిక్ మృతిపై విచారణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఉరివేసుకోవడం వలనే తౌషిక్ మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టు వచ్చిందని తెలిపారు. పోస్టుమార్టం చేసి శరీరంలోని ప్రధాన అవయవాలను రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపించినట్లు తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు వ్యక్తం చేసిన సందేహాల మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. అయితే స్థానిక అధికారుల పట్ల తౌషిక్ తల్లిదండ్రులు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేయడంతో ఎస్పీ హర్షవర్థన్‌రాజు కందుకూరు సీఐ షేక్ అన్వర్‌బాషాను విచారణాఽధికారిగా నియమించినట్లు తెలిపారు. స్థానిక అధికారుల ప్రమేయం లేకుండా కందుకూరు సీఐ అన్వర్ బాషా విచారణ చేశారని, 70 మంది సాక్షులను, 47 మంది విద్యార్థులను విచారించినట్లు తెలిపారు. అయితే మృతి చెందిన తౌషిక్ ఒకరోజు ముందు తల్లితో మాట్లాడినప్పుడు, చనిపోవడానికి కొద్దిసేపు ముందు తల్లితో మాట్లాడినప్పుడు విచారంగా ఉన్నట్లు సాటి విద్యార్థులు గమనించినట్లు విచారణలో తెలిసిందన్నారు. తల్లిదండ్రులు అనుమానించిన కోణంలోనే మొదట్నుంచి విచారణ జరిపామని, ఇప్పటి వరకు హత్యకు గురైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ తల్లిదండ్రులు తౌషిక్ మరణాన్ని హత్యగానే అనుమానం వ్యక్తం చేస్తున్నందున విచారణ చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. విలేకరుల సమావేశంలో కేసు విచారణాధికారిగా వ్యవహరించిన కందుకూరు సీఐ షేక్ అన్వర్ బాషా, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య పాల్గొన్నారు.


