జిల్లా ఆస్పత్రుల్లో అరకొర వైద్యం మార్కాపురం వైద్యశాలలో వైద్యుల కొరత ఒంగోలు జీజీహెచ్‌లో అందుబాటులో ఉండని హెచ్‌ఓడీలు జూనియర్లు, పీజీలతోనే పనికానిస్తున్న వైనం సొంత ఆస్పత్రుల్లో బిజీగా స్పెషలిస్టు వైద్యులు స్కానింగ్ తీసిన వారానికి రిపోర్టులు
స్పెషాలిటీ వైద్యం అందని ద్రాక్షే...
పేదల ప్రాణం..
మార్కాపురం జీజీహెచ్‌లో రోగులు లేక ఖాళీగా ఉన్న బెడ్లు
ఒంగోలు టౌన్:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) ఉండగా, మార్కాపురంలో జిల్లా ఆస్పత్రి ఉంది. జిల్లా వైద్యశాలను సాక్షి బృందం పరిశీలించింది. రెండు చోట్లా రోగులకు అరకొర వైద్యమే అందుతోంది. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సీనియర్ వైద్యులు, హెచ్‌ఓడీలు కనిపించడం గగనమైపోయింది. ఈ ఆస్పత్రికి ప్రతి రోజూ వివిధ రకాల వైద్య సేవల కోసం సుమారు 1000 నుంచి 1500 మంది వరకు వస్తుంటారు. పెద్దాస్పత్రికి వెళితే అక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారని, వైద్యం బాగుంటుందన్న ఆశతో వచ్చే రోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సీనియర్లు ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహించుకుంటూ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులతో పనికానిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒంగోలు జీజీహెచ్‌లో ఇదీ పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాలతో పాటు పల్నాడు జిల్లాలోని వినుకొండ, శావల్యాపురం, నూజండ్ల, బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం మండలాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు ఇక్కడకు వస్తుంటారు. చిన్న చిన్న వ్యాధులకు స్థానికంగా ఆర్‌ఎంపీల దగ్గర వైద్యం చేయించుకునే గ్రామీణ నిరుపేదలు దీర్ఘకాలిక వ్యాధులు, అత్యవసర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు జీజీహెచ్‌కు వస్తుంటారు. అయితే క్యాజువాలిటీలో ఎప్పుడు చూసినా జూనియర్ వైద్యులే కనిపిస్తున్నారని, సీనియర్ వైద్యులు ఉండడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఓపీలో ఒకరిద్దరు సీనియర్లు డ్యూటీలు చేస్తే గొప్ప అన్నట్లు తయారైంది. ఇక్కడ పేరుకు ఎంఐసీయూ, ఎన్‌ఐసీయూ, ఆర్‌ఐసీయూ, పీఐసీయూ, ఎస్‌ఐసీయులు ఉన్నాయి. ఇక్కడ స్పెషలిస్ట్ వైద్యులు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని, పీజీ విద్యార్థులే దిక్కయ్యారని రోగులు చెబుతున్నారు.
ఖాళీగా ట్రామా కేర్...
ఒంగోలు చుట్టు పక్కల ఎక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగినా క్షతగాత్రులను జీజీహెచ్‌కు తీసుకొస్తుంటారు. క్యాజువాలిటీలో ఒక చిన్నగదిలో రెండు పడకలు వేసి ట్రామా కేసుల కోసం కేటాయించారు. ట్రామా కేర్‌లో ఒక న్యూరాలజిస్ట్, ఒక మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్‌లతో కలిపి మొత్తం 30 మంది వరకు ఉండాలి. కానీ వారిని ఇతర విభాగాల్లో డ్యూటీలు వేస్తున్నట్లు సమాచారం. ట్రామా కేసుల కోసం ప్రత్యేక సిబ్బంది ఉన్నారోలేదో, అసలు ట్రామా విభాగం ఉందో లేదో తెలియని పరిస్థితి. ట్రామా కేర్ నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నర్సింగ్ సేవలు అంతంత మాత్రమే...
జీజీహెచ్‌లో కనీసం 300 మంది వరకు ఇన్ పేషంట్లు ఉంటారు. జనరల్ వార్డులు, అత్యవసర వార్డుల్లో విధులు నిర్వహించే నర్సింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని రోగులు, వారి సహాయకులు ఫిర్యాదు చేస్తున్నారు. వార్డుల్లో విధులు నిర్వహించాల్సిన స్టాఫ్ నర్సులు సెల్‌ఫోన్లు చూస్తూ కాలయాపన చేస్తున్నారని రోగులు చెబుతున్నారు. ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ, నర్సింగ్ విద్యార్థినులకు పనులు అప్పచెప్పి టైం పాస్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా కొందరు నర్సింగ్ స్టాఫ్ తరచుగా రోగులతో ఘర్షణ పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. నర్సింగ్ స్టాఫ్ కు డ్యూటీలు వేసేందుకు లంచాలు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నడవలేని స్థితిలో రోగులు జీజీహెచ్‌కు వస్తే వారికి వీల్‌చైర్‌లు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. ఒక వేళ వీల్‌చైర్ దక్కించుకున్నా రోగుల కుటుంబ సభ్యులే తోసుకెళ్లాల్సిన పరిస్థితి.
ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో డాక్టర్ల కొరత
మార్కాపురం టౌన్: మార్కాపురం జీజీహెచ్‌లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మెరుగైన వైద్యం అందేది. కరోనా సమయంలో కూడా ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించి ఎప్పటికప్పుడు వైద్యశాల సిబ్బంది రోగులను పర్యవేక్షిస్తూ వారికి వైద్యం అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ వైద్యాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు వైద్యానికి పెద్దపీట వేసింది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ వైద్యశాలలో సరైన మందులు, స్పెషలిస్టు వైద్యులు, వైద్య సిబ్బంది నియమించకపోగా ఉన్న సిబ్బందిని, వైద్యశాలలో ఉన్న పరికరాలను ఇతర ప్రాంతాలకు తరలించడంతో పూర్తిగా నిర్వీర్యమైంది. దీంతో ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లినా తమకు వచ్చిన రోగాలు నయమవుతాయో లేదో అన్న అనుమానంలో ప్రజలు వైద్యశాలకు వెళ్లడం తగ్గించారు. గత ప్రభుత్వంలో 100 పడకలు ఉన్న వైద్యశాలను 330 పడకల వైద్యశాలగా మార్చి సూపర్ స్పెషాలిటీ వైద్యులు, నాన్ క్లినికల్ వైద్యులతో కలిపి సుమారు 70 మంది వైద్యసేవలను అందించారు. రోజుకు 600 నుంచి 700 ఓపీ సేవలతో కిటకిటలాడేది. అయితే అప్పుడున్న వైద్యుల సంఖ్యను తగ్గించడంతోపాటు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో వైద్యుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. వైద్యశాలలో అందుతున్న సేవలు తగ్గిపోవడంతో రోగుల సంఖ్య ప్రస్తుతం 100 నుంచి 150కి ఓపీలకు పడిపోయింది. గతంలో 330 బెడ్లకు గానూ ఇన్ పేషంట్లు 200 మంది ఉండగా ప్రస్తుతం 20 నుంచి 30 మంది రోగులు మాత్రమే ఇన్‌పేషంట్లుగా కనిపిస్తున్నారు. వైద్యశాల నుంచి బ్లడ్‌బ్యాంకు వైపు వెళ్లే ప్రాంతాల్లో నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతున్నాయి. ప్రస్తుతం సుమారు 15 మంది వైద్యులు ఉండగా 55 మందిపైగా రోగులకు సేవలు అందిస్తున్నారు. వైద్యశాలకు వెళ్లే కొద్దిమందికి కూడా కనీస అవసరమైన జలుబు, దగ్గు మందులు కూడా లేవని ఫార్మాసిస్టు తెలపడంతో బయటకు వెళ్లి కొనుగోలు చేసి వాడుకోవాల్సి వస్తోంది. ఇన్‌పేషంటు వార్డుల్లో రోగులు లేక అన్నీ బ్లాకుల్లో ఏర్పాటు చేసిన బెడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఉన్న పరికరాలను కూడా గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించారు. రోగులు లేక వైద్యశాలలో నూతన బెడ్లు మూలనపడి పాడైపోతున్నాయి. బాలింతలకు స్కానింగ్ చేసే రేడియాలజిస్టు పోస్టు లేకపోవడంతో గైనకాలజిస్టుతోనే బిడ్డ ఆరోగ్య పరిస్థితి చెబుతున్నారే తప్ప పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే బయటి స్కానింగ్ సెంటర్లను బాలింతలు ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో పేషంట్లతో కిటకిటలాడిన జీజీహెచ్ ప్రస్తుతం పేషంట్లు లేక వెలవెలబోతోంది.
జీజీహెచ్‌లో స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నప్పటికీ ప్రజలకు వైద్యం అందడం లేదు. సోమ, గురువారం న్యూరాలజీ రోగులకు ఓపీ ఉంటుంది. గుండె జబ్బుల ఓపీ మంగళ, గురువారం ఉంటుంది. యూరాలజీ ఓపీ బుధ, శనివారం చూస్తారు. ఒకసారి చూపించుకోవడానికి ఒకపూట పడుతుంది. ఆ తరువాత అవసరమైనా ఆ వైద్యులు కనిపించరు. డాక్టర్ కోసం ఆరా తీస్తే ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నారని చెబుతుంటారు. అక్కడకు వెళ్లి అడిగితే ఓపీలో ఉన్నట్లు సమాధానం వస్తుంది. తీరా చూస్తే సొంత ఆస్పత్రిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో విసుగెత్తిన రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. స్పెషలిస్ట్ వైద్యులు మాత్రం జీజీహెచ్‌లో జీతాలు తీసుకుంటూ ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు.


