అటెన్‌ షన్‌ ! | - | Sakshi
Sakshi News home page

అటెన్‌ షన్‌ !

Mar 16 2026 7:40 AM | Updated on Mar 16 2026 7:40 AM

మార్కాపురం: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం 165 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేటి నుంచే ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. మార్కాపురం జిల్లా ఏర్పాటైన తరువాత మొదటిసారి జరుగుతున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 87 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 28,632 మంది విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షలకు హాజరు కానున్నారు. రెగ్యులర్‌ విభాగంలో 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు ఉన్నారు. మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లో ఈ దఫా 87 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా 14,596 మంది హాజరు కానున్నారు. ఇందులో ఏ గ్రేడ్‌ సెంటర్లు 42, బీ గ్రేడ్‌ సెంటర్లు 26, సీ గ్రేడ్‌ సెంటర్లు 49గా అధికారులు గుర్తించారు. ఉదయం 9.30 నుంచి గం.12.40 వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఏ గ్రేడ్‌ సెంటరు అంటే పోలీసు స్టేషన్‌కు సమీపంలో ఉన్న పరీక్ష కేంద్రాలు, బీ గ్రేడ్‌ సెంటరు అంటే పోలీసు స్టేషన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రాలు, సీ గ్రేడ్‌ సెంటరు అంటే అంతకంటే దూరంలో ఉన్న కేంద్రాలుగా విభజించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

సమస్యాత్మక కేంద్రాలు ఇవే...

మార్కాపురం జిల్లాలో 8 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించారు. బేస్తవారిపేట మండలంలోని పిటికాయగుళ్ల జెడ్పీహెచ్‌ఎస్‌, పెద్దారవీడు మండలంలోని వైడిపాడు జెడ్పీహెచ్‌ఎస్‌, సీఎస్‌పురం మండలంలోని సీఎస్‌పురం జెడ్పీహెచ్‌ఎస్‌, మండల కేంద్రమైన కొమరోలు జెడ్పీహెచ్‌ఎస్‌, అర్ధవీడు మండలంలోని యాచవరం జెడ్పీహెచ్‌ఎస్‌, మండల కేంద్రమైన రాచర్ల జెడ్పీహెచ్‌ఎస్‌, యర్రగొండపాలెం పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్‌, హెచ్‌ఎంపాడు జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలను గుర్తించారు. ఇక్కడ ప్రత్యేకమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు కూడా నేటి నుంచే ప్రారంభం:

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈనెల 16 నుంచి 28వ తేదీ వరకూ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పరీక్షలు కూడా జరగనున్నాయి. మొత్తం 1144 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 823 మంది బాలురు, 321 మంది బాలికలు హాజరుకానున్నారు. ఇందుకోసం 14 సెంటర్లను ప్రభుత్వం కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement