అంగన్‌వాడీల అరెస్టు
● అరెస్టులకు నిరసనగా అంగన్‌వాడీల మానవహారం
ఒంగోలు టౌన్: అంగన్‌వాడీల వేతనాలు పెంచాలని, ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలని కోరుతూ చేపట్టిన చలో విజయవాడ మహాధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీ రాష్ట్ర నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ ఖండించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా నిర్వహించారు. అనంతరం యూనియన్ నాయకులు, కార్యకర్తలు చర్చి సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్భంధానికి వ్యతిరేకంగా, అక్రమంగా అరెస్టు చేసిన అంగన్‌వాడీ నాయకులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ధర్నాకు ఒంగోలు ప్రాజెక్టు కార్యదర్శి కె.ఎమీమా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెల 22వ తేదీ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనివార్య పరిస్థితులలో విజయవాడలో మహాధర్నా చేపట్టినట్లు వివరించారు. ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్‌వాడీలు హాజరయ్యారని, దీన్ని సహించలేక మూడో తేదీ ఉదయం 4.30 సమయంలో నిద్రలో ఉన్న రాష్ట్ర నాయకులను లేపి పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారని తెలిపారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీసు వాహనాలలో తీసుకెళ్లి అరెస్టు చేశారని , ఇది దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్‌వాడీలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయన్నారు. ఐసీడీస్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిరా అంగన్‌వాడీలను కార్మికులుగా గుర్తించడం లేదని, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ , పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదని చెప్పారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని అడగడం నేరమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేయడం మాట తప్పడమేనని చెప్పారు. న్యాయమైన డిమాండ్ల కోసం విజయవాడ మహాధర్నాలో పాల్గొన్న నాయకులపై పోలీసులను ఉసిగొల్పడం దారుణమన్నారు. సీఐటీయూ నాయకులు సీహెచ్ మంజుదార్, జి.రమేష్ మాట్లాడుతూ కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు పెంచడానికి ఖజానాలో డబ్బులు లేవని చెబుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌లు విమానాల్లో తిరగడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ధర్నాలో కేవి.సుబ్బమ్మ, నిర్మలా దేవి, శేషమ్మ, సంధ్య, మాధవి, శోభ, అరుణ, స్వామిరెడ్డి, తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.


