న్యూస్‌రీల్
కూటమి నేతల మధ్య మాటల యుద్ధం ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మరోవైపు మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని భూ కబ్జాలు చేసింది నువ్వంటే..మెప్మాలో మెక్కింది నువ్వని ఆరోపణలు.. ప్రత్యారోపణలు పార్టీ అండ లేకపోయినా ఎమ్మెల్యే అవినీతిపై జనం అండతో పోరాడుతానని బాలినేని ప్రకటన అసలు దొంగలెవరో తేల్చాలంటున్న జనం ఒంగోలులో పొలిటికల్ ఉక్కపోత
మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026
ఒంగోలులో అధికార కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ‘‘నువ్వు దొంగంటే.. కాదుం నువ్వే దొంగ’’ అంటూ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు గుప్పించుకుంటూ ఇరుపార్టీల నేతలు పోటాపోటీగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. బహిరంగంగానే బురదజల్లుకోవడంతో స్థానిక రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ–జనసేన పార్టీ నేతలు కలిసి అధికారం అనుభవిస్తున్నప్పటికీ, ఒంగోలులో పరస్పర ఆరోపణలతో రోడ్డెక్కడం సంచలనంగా మారింది. ఇంత జరుగుతున్నా పార్టీ అధినాయకత్వం చూసిచూడనట్టుగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి. నగర రాజకీయాలు ఇక ఎటు మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
నవ్వుల పాలవుతున్న కూటమి నాయకుల తీరు..
వారిద్దరూ అధికార కూటమి పార్టీ నాయకులే. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మరొకవైపు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి నువ్వంటే నువ్వని ఒకరి మీద మరొకరు అవినీతి అరోపణలు చేసుకుంటున్నారు. నువ్వు చేసిన కబ్జాలు ప్రజలందరికీ తెలుసంటూ దామచర్ల భగ్గుమంటే, నీ అవినీతి అరాచకాలను బయటపెట్టేంత వరకు వదిలి పెట్టేది లేదని బాలినేని సవాల్ విసురుతున్నారు. ఒంగోలులో జరుగుతున్న భూ కబ్జాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో నిరుపేద ప్రజలు భయపడిపోతున్నారని, వారికి అండగా నిలబడతానని ప్రకటించారు. నువ్వేం దోచుకుంటున్నావో, నేనేం దోచుకున్నానో ప్రజలకు తెలుసన్నారు. దీనికి స్పందించిన దామచర్ల.. హైదరాబాద్ నుంచి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, నీ ఇష్టం వచ్చినట్లు ఇసుక, మట్టి లూటీ అని మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి బాలినేని గురించి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. దొంగ నువ్వంటే నువ్వేనని ఒకరి మీద మరొకరు అవినీతి అరోపణలు చేసుకుంటుంటే అసలు దొంగలెవరో తేల్చాలని ఒంగోలు ప్రజలు కోరుతున్నారు.
మాటలు వేడెక్కి..
కూటమి వీధికెక్కి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఒంగోలులో రాజకీయాలు వేడెక్కాయి. ఇటీవల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై వచ్చిన లేఖ ఈ చిచ్చును మరింత రాజేసింది. దీంతో కూటమి నాయకులు నువ్వా నేనా అంటూ కుస్తీకి దిగారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వచ్చారు. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని, ఇసుక, మట్టి, రేషన్, మద్యం లూటీ జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు. మెప్మా అవినీతికి పాల్పడిన వారి పేర్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల అవినీతి జరిగితే అధికారులను బలిచేసి సొంత మనుషులను కాపాడుకున్నారని ఆరోపించారు. తన హయాంలో బ్రాహ్మణుల భూమిని కబ్జా చేసినట్లు దామచర్ల తప్పుడు ప్రచారం చేయించారని గుర్తు చేసిన బాలినేని ఇప్పుడా భూమిని ఎవరు కబ్జా చేశారో తేల్చాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల భూమి ఒక్కటే కాదని ఇంకా నాలుగైదు భూముల కబ్జా చేశారని, వాటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని విచారణ జరపాలని చెప్పారు. ఎమ్మెల్యే అవినీతిపై వచ్చిన లేఖ గురించి ప్రస్తావించారు. ఆ లేఖను హైదరాబాద్‌లో కూర్చొని రాయించినట్లు తనపై విమర్శలు చేయడాన్ని ఖండించారు. సొంత ఇంటి మనిషే లేఖ రాసినట్లు తేలితే ఇంటికి పిలిపించుకొని రాజీ చేసుకున్నారని ఆరోపించారు. తన మీద లేఖ రాసిన వ్యక్తిని ఎవరైనా ఇంటికి పిలిపించుకుంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దామచర్ల సొంత మనుషులే మెప్మా దొంగలని, వారిని కాపాడేందుకు అధికారులను బలిచేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే దామచర్ల మీద లెటర్ వేయించలేదని తన కుమారుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, నా పాత్ర ఉందని నీవు నీ కూతురి మీద ప్రమాణం చేయగలవా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలినేనిపై రెచ్చి పోయారు. పరుష పదజాలంతో దూషణలందుకున్నారు. తన మీద వచ్చిన లేఖను వెనక బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నట్లు ఆరోపణలు చేశారు. లేఖ రాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బొమ్మినేని మురళిని రక్షించేందుకు బాలినేని ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు ఆరోపించారు. ఇప్పుడు తనకేమీ తెలియదంటే ఎలాగని ప్రశ్నించారు. ఎప్పటిలాగే బాలినేనిని ఒదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఒకరి మీద మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ రోడ్డెక్కారు.
మెప్మా అవినీతిపై విచారణ జరపాలి..
మెప్మా అవినీతిపై విచారణ జరపాలని, అసలు నిందితుల పేర్లను బయట పెట్టాలని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి నేరుగా కలెక్టర్‌కు ఫోన్ చేసినట్లు చెప్పడం సంచలనం సృష్టించింది. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తనకు చెప్పారని మీడియా సమావేశంలో బాలినేని చెప్పారు. మెప్మాలో జరిగిన అవినీతి మీద ఊరికే ఆరోపణలు చేయకుండా కలెక్టర్ వద్దకు వెళ్లి కలవాలని చెప్పిన దామచర్లకు గొంతులో వెలక్కాయ పడినట్లయిందని టీడీపీలోని అసంతృప్తి వర్గం చెబుతోంది.
తొలి నుంచి ఒంగోలు కూటమిలో ఎమ్మెల్యే దామచర్ల, జనసేన నేత బాలినేని మధ్య విభేదాలున్నాయి. ఇప్పటి వరకు చాపకింద నీరులా ఉన్న విభేదాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. నాయకులిద్దరూ ఒకరి మీద మరొకరు తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసుకుంటుంటే ఆ రెండు పార్టీలకు చెందిన అధినాయకత్వం చూసిచూడనట్లు వదిలిపెట్టడం వెనక ఉద్దేశం ఏమిటో అర్థంకాక టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. బాలినేని మీద ఆరోపణలు చేస్తున్న దామచర్ల తాను ఎమ్మెల్యేగా మాట్లాడడం లేదని చెబుతున్నారు. బాలినేని సైతం తాను జనసేన నాయకుడిగా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నానని చెబుతున్నారు. కూటమి ఐక్యత కోసం ఏడాదిన్నర కాలం ఊరుకున్నట్లు ఇద్దరు నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో కలిసి అధికారం అనుభవిస్తున్న టీడీపీ, జనసేన నాయకులు ఒంగోలులో పరస్పర ఆరోపణలతో రోడ్డెక్కడంపై రెండు పార్టీల కేడర్ అయోమయంలో పడిపోయింది. వారం రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.


