● ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరైన కుమారుడు
జె.పంగులూరు: అనారోగ్యంతో తల్లి మృతి చెందిన బాధలో ఉన్న కుమారుడు ఇంట్లో తల్లి మృతదేహం ఉండగానే..ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు హాజరైన ఘటన జే పంగులూరు మండల పరిధిలోని అలవలపాడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన కాకర్లమూడి సుజాత (35) రెండు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. ఒంగోలు ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయిస్తున్నారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం భర్త ఆదాం ఆమెను చైన్నె తీసుకెళ్లాడు. సుజాత చైన్నె వెళ్లే సమయంలో తన ముగ్గురు పిల్లలైన రత్నరాణి, ప్రేమ్‌కుమార్, విజయ్‌తో మాట్లాడింది. బాగా చదువుకోవాలని..తాను చూపించుకొని వెంటనే వస్తానని చెప్పి వెళ్లింది. ఆదివారం రాత్రి చైన్నెలో చికిత్స పొందుతూ సుజాత మృతి చెందింది. సోమవారం ఆమె మృతదేహాన్ని అలవలపాడు గ్రామానికి తీసుకొచ్చారు. తల్లి మృతదేహం చూసిన ముగ్గురు పిల్లలు బోరున విలపించారు. తల్లి మృతదేహం ఇంటిలో ఉండగానే ఆమె కోరినట్లు తన భవిష్యత్తు కోసం కుమారుడు ప్రేమ్ కుమార్ అద్దంకిలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాసిన అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కుమార్తె రత్నరాణి డిగ్రీ చదువుతోంది. మూడో కుమారుడు విజయ్ గ్రామంలోనే 7వ తరగతి చదువుతున్నాడు.


