వలపు వల! | - | Sakshi
Sakshi News home page

వలపు వల!

Mar 2 2026 7:26 AM | Updated on Mar 2 2026 7:26 AM

వలపు వల!

వలపు వల!

ఖాకీ కనుసన్నల్లోనే వలపు వల!

ఖాకీ కనుసన్నల్లోనే

నాగులుప్పలపాడు: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. ఆ తప్పుడు పనులను వెనకేసుకురావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో వ్యభిచారం జోరుగా నిర్వహిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు, ఎం.ముప్పాళ్ల గ్రామానికి చెందిన మరో యువకుడు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం ఉప్పుగుండూరు గ్రామంలోని ఓ మహిళ ఇంటి వద్దకు తెలంగాణకు చెందిన ముగ్గురు యువతులు వచ్చారు. దీంతో ఆ మహిళ భర్త ‘ఎవరు వీరు’ అని ప్రశ్నించడంతో సదరు యువతులతో ఉన్న యువకులు దాడి చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సదరు మహిళ కూడా ఒంగోలు జీజీహెచ్‌లో చేరి ఆ నివేదిక ఆధారంగా పోలీసులను ఆశ్రయించారు. పరస్పర ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఆ మహిళ తీసుకొచ్చిన యువతులు ఎవరు? సదరు యువతులతోపాటు ఆ ఇంటిలో ఉన్న యువకుల పాత్ర ఏమిటన్నది నాగులుప్పలపాడు పోలీసులు ఇంత వరకు వెల్లడించలేదు. ఇదిలా ఉండగా.. సదరు మహిళ భర్త కృష్ణ మాత్రం అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నాడు. తన సెల్‌ఫోన్‌లో అక్కడి బాగోతాన్ని రికార్డు చేశానని, తనపై దాడి చేసిన వారు ఫోన్‌ లాగేసుకున్నారని చెబుతున్నాడు. ఫోన్‌ను రికవరీ చేయాలని తాను పోలీసులను కోరగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ బాగోతానికి వెన్నుదన్నుగా ఉన్న పోలీసు సిబ్బంది తనను బెదిరిస్తున్నారని కృష్ణ ఆరోపిస్తుండటం సంచలనంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు పారదర్శకంగా విచారణ చేపడితే వాస్తవాలు వెల్లడవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పచ్చ నేత పంచాయితీ..

ఉప్పుగుండూరుకు వచ్చిన యువతులను ప్రశ్నించడంతో దాడి చోటుచేసుకోగా.. పోలీసులు నమోదు చేసిన కేసుల్లో వారి గురించి కనీస ప్రస్తావన చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. యువతులను తరచూ ఇక్కడికి తీసుకొస్తున్న వారే ఓ కానిస్టేబుల్‌ సహకారంతో ఇటీవల స్టేషన్‌లో మరమ్మతులు చేయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులు చర్యలకు వెనుకాడుతున్నారనేందుకు ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఉప్పుగుండూరుకు చెందిన ఓ టీడీపీ నేత పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ చేయడం, స్టేషన్‌ నుంచి టీడీపీ నేత వెళ్లిపోగానే తెలంగాణ యువతులు, నిర్వాహకులను ఆగమేఘాల మీద విడుదల చేయడం, వ్యభిచార వ్యవహారాన్ని గుట్టుగానే ఉంచి భార్యాభర్తల గొడవలా చిత్రీకరించేందుకు పోలీసులు యత్నించడంపై స్థానికంగా సోషల్‌ మీడియాలో దుమారం రేగుతోంది. ఈ విషయంలో గ్రామంలో టీడీపీ పరువు పోవడంతో డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరలేపారు. సామాజిక మాధ్యమాల్లో వైఎస్సార్‌ సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. అయితే పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించిన జనసేన నేతపై బెదిరింపులకు దిగడం గమనార్హం.

ఉప్పుగుండూరులో తెలంగాణ యువతులు

వ్యభిచార నిర్వాహకురాలిని భర్త ప్రశ్నించడంతో దాడి

కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు నాగులుప్పలపాడు పోలీసులపై ఆరోపణలు

ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే సెటిల్‌మెంట్లు చేస్తున్న పచ్చ నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement