నేడు లక్ష్మీనృసింహస్వామి తిరునాళ్ల
మర్రిపూడి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పృథులగిరి లక్ష్మీనృసింహాస్వామి తిరునాళ్లను సోమవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ నర్రా నారాయణరెడ్డి తెలిపారు. వైఖానస ఆగమయోక్తంగా రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనృసింహ స్వామిని గరుడ వాహనంపై ఊరేగిస్తున్నట్లు తెలిపారు. గరుడోత్సవ సేవకు అలవల వెంకయ్య, సుందరరావు కుమారులు ఉభయదాతలుగా వ్యవహరించనున్నారు. తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం పొదిలి నుంచి 10 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. కొండపి సీఐ సోమశేఖరరావు, ఎస్సై రమేష్‌బాబు తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పలు సామాజిక వర్గాలకు చెందిన సత్రాల్లో అన్న సంతర్పణకు ఏర్పాట్లు చేశారు.
ఒంగోలు సిటీ: ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సంబంధించి ఇంటర్మీడియెట్ సంస్కృత సబ్జెక్టు జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆర్‌ఐఓ ఆంజనేయులు తెలిపారు. ఒంగోలులోని అంజయ్య రోడ్‌లో గల ఏకేవీకే జూనియర్ కళాశాలలో మూల్యాంకనానికి ఏర్పాట్లు చేసినట్లు ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ ఇంటర్మీడియెట్ విద్యా మండలి నుంచి ఆర్డర్లు పొందిన ఏఈలు, ఏసీఓ(వాల్యూషన్)లు తప్పనిసరిగా నిర్దేశిత తేదీ, సమయానికి మూల్యాంకన కేంద్రంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. ఆర్డర్లు పొంది మూల్యాంకనానికి హాజరు కాకపోతే.. సదరు వ్యక్తులపైనే కాకుండా సంబంధిత కళాశాలలపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మార్కాపురం రూరల్: సీపీఎం మార్కాపురం జిల్లా కార్యదర్శిగా దగ్గుపాటి సోమయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మార్కాపురం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ సభ్యులుగా ఎస్‌డీ హనీఫ్, ఊసా వెంకటేశ్వర్లు, కేశవరావు, మాల్యాద్రి, డీకేఎం రఫీ, గుమ్మా బాలనాగయ్యను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడతామని సోమయ్య తెలిపారు.
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలతో ఈ నెల 2వ తేది నుంచి 9వ తేదీ లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని డీఈఓ సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల యజమాన్యాలతో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు (స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ), సమానమైన క్యాడర్) వారి సాధారణ సీనియారిటీ జాబితా వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు. ఉపాధ్యాయులంతా గమనించాలని కోరారు.
ఒంగోలు టౌన్: కోడి పందేల శిబిరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఒంగోలు రూరల్ మండలంలోని గుండాయపాలెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని సముద్రం కాలువ ప్రాంతంలో రహస్యంగా కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్సైలు శివరామయ్య, చెంచయ్య, ఏఎస్సై మహబూబ్‌బాషా మారు వేషాల్లో రంగంలోకి దిగారు. జూద శిబిరంపై ఆకస్మికంగా దాడి చేసి 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 సెల్‌ఫోన్లు, 2 పందెం కోళ్లు, రూ.43,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
నేడు లక్ష్మీనృసింహస్వామి తిరునాళ్ల


