పదిలమేనా!
పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాల కోసం వంద రోజుల ప్రణాళిక సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులు అల్పాహారం లేక నీరసిస్తున్న విద్యార్థులు తగ్గుతున్న విద్యార్థుల హాజరు శాతం ఉమ్మడి జిల్లాలో పది విద్యార్థులు 16,954 మంది నిధులు విదల్చని ప్రభుత్వం
బేస్తవారిపేట:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 354 ప్రభుత్వ పాఠశాలల్లో 16,954 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో బాలికలు 9,375, బాలురు 7,579 మంది ఉన్నారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ తరగతులు జరుగుతాయి. ఇంటికి చేరుకునే సరికి ఆరు గంటలు దాటుతోంది. దూర ప్రాంతాల పిల్లలకు రాత్రి 8 గంటలు దాటుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు అందించే మధ్యాహ్న భోజనం మాత్రమే అందుతోంది. ఫలితంగా విద్యార్థులు నీరసించిపోతున్నారు.
అల్పాహారం అందక అవస్థలు
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల కార్యక్రమానికి నిధుల కొరత సమస్యగా మారింది. ప్రత్యేక తరగతులకు విద్యార్థులు ఇంటి నుంచి బయలు దేరి ఇంటికి చేరే సరికి దాదాపు 12 గంటల సమయం అవుతోంది. ఉదయం 7.30కి పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో పాటు అల్పాహారం అందించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అల్పాహారానికి నిధులు విడుదలచేయలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 16,954 మంది విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. సాయంత్రం వరకు చదువుకుంటున్న విద్యార్థులు నీరసించిపోతున్నారు. కాలే కడుపుతో చదువుపై పూర్తి స్థాయిలో ఏకాగ్రత నిలపలేక ఇబ్బంది పడుతున్నారు.
గ్రామీణ విద్యార్థుల అవస్థలు
గ్రామీణ ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నాలుగైదు కి.మీ.లు నడిచి వచ్చే విద్యార్థులు ఇంటికి వెళ్లే సరికి రాత్రి ఏనిమిది గంటలు అవుతుండడంతో.. వారు పూర్తిగా నీరసించిపోతున్నారు. ఉదయం వంట కాకపోవడంతో మధ్యాహ్నం వరకు ఖాళీ కడుపుతో ఉండి క్లాసులు వినాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు.
తగ్గుతున్న హాజరు శాతం
ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆరోగ్యంపై చూపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు సమస్యలు ఎదురవుతుండడంతో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని తెలుస్తోంది. రోజువారి హాజరు పరిశీలిస్తే 15 నుంచి 20 శాతం మంది విద్యార్థులు సక్రమంగా స్టడీ అవర్స్‌కు రావడంలేదు. తల్లిదండ్రులను సంప్రదించినా ఫలితం ఉండడం లేదని తెలుస్తోంది.


