తౌషిక్ మృతి కేసులో పోలీసుల వైఫల్యం
తౌషిక్ మృతికి కారకులకు శిక్ష పడే వరకు రాష్ట్ర స్థాయిలో పోరాటం స్కూలు యాజమాన్యానికి కొమ్ముకాస్తున్న పోలీసులు తౌషిక్ కేసుపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
సింగరాయకొండ: స్థానిక శ్రీ చైతన్య నవోదయ స్కూలులో అనుమానాస్పదంగా మృతి చెందిన తౌషిక్ కేసులో పోలీసులు, త్రిసభ్య కమిటీ మొక్కుబడి విచారణ జరుపుతూ స్కూలు యాజమాన్యానికి అండగా ఉన్నారని, ఈ కేసుపై జ్యుడిషియల్ విచారణ చేసి బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సరస్వతి కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం ఆయన విద్యార్థి తల్లిదండ్రులు సయ్యద్ ఆలీ, మౌలాబితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ సాయంత్రం 6వ తరగతి చదువుతున్న తౌషిక్ (11) అనుమానాస్పద మృతి వ్యవహారంలో వార్డెన్ కాని వార్డెన్ బాబ్జీకి, కరస్పాండెంట్ కుమారుడు చైతన్యకు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని సంబంధం ఉందని ఆరోపించారు. విద్యార్థిపై ఉన్న దెబ్బలను బట్టి గోడకేసి కొట్టి కానీ, గొంతునులిమి కానీ చంపేశారని ఈ ఘటనను ఆత్మహత్యగా సృష్టించి తమకు ఉన్న పలుకుబడితో కేసు నుంచి బయటపడతామన్న ధీమాతో చంపేశారని ఆరోపించారు. పోలీసులు మాత్రం నేటికీ విచారణ జరుపుతున్నామని చెబుతున్నారన్నారు. వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అనుమానితుల పేర్లను చేర్చి దోషులను అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు స్కూలు యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈ కోచింగ్ సెంటర్‌కు గానీ, పాఠశాలకు కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేవని, హాస్టల్ భవనానికి అనుమతులు లేవన్నారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న ఇద్దరు మహిళలకు, వార్డెన్ బాబ్జీ, కరస్పాండెంట్ కుమారుడు చైతన్యకు మధ్య ఉన్న సంబంధాన్ని పోలీసులు నిజాయితీగా విచారిస్తే కేసు కొలిక్కి వస్తుందని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎస్సై మహేంద్ర, సీఐలు బాధితుల పక్షాన నిలబడకుండా ఫిర్యాదు చేయటానికి వచ్చిన వారిని బూతులు తిట్టి భయభ్రాంతులకు గురి చేశారని, దీంతో వీరిని కాదని కేసు విచారణ అధికారిగా కందుకూరు సీఐ షేక్ అన్వర్‌బాషాను నియమిస్తే ఆయన కూడా స్కూలు లో విచారణ చేయకుండా కనిగిరి పోయి విచారిస్తూ యాజమాన్యానికి కొమ్ముకాసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో విద్యాశాఖామంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. స్కూలు గుర్తింపును రద్దు చేయటంతో పాటు స్కూలు యాజమాన్యాన్ని, వార్డెన్ బాబ్జీని, ఇద్దరు టీచర్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.35 లక్షలు చేతులు మారాయని ఎస్సై, ఇద్దరు సీఐలు, డీఈఓ, ఎంఈఓలను సస్పెండ్ చేయాలన్నారు. విద్యార్థి మృతి ఘటనపై ప్రజాసంఘాలు, కుల సంఘాలు న్యాయం చేయాలని పోరాటం చేస్తుంటే మంత్రి స్వామి మాత్రం ఈ రోజు వరకు స్పందించలేదని, కనీస భాధ్యతగా విచారణ జరపలేదని విమర్శించారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ 11వ సంవత్సరాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని స్కూలు యాజమాన్యం చెప్పటం దానిని పోలీసులు సపోర్టు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎస్సై మహేంద్ర బాధితులు తమ కొడుకు చనిపోయాడని ఫిర్యాదు చేయటానికి వస్తే వారిని బూతులు తిట్టడం బాధాకరమన్నారు. వారిపైనే కేసులు పెడతాననడం ఎస్సై నిరంకుశతత్వానికి నిదర్శనమన్నారు. కరేడు మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు విద్యార్థిని ప్రత్యక్షంగా చంపేస్తే పోలీసులు పరోక్షంగా హత్య చేశారని ఆరోపించారు. కలెక్టర్ వేసిన త్రిసభ్య కమిటీ పత్తా లేదన్నారు.
మైనారిటీ నాయకుడు షేక్ సుల్తాన్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు. బిడ్డ చనిపోయాడు ఎస్సై ని కేసు తీసుకోమంటే పట్టించుకోకుండా వారిపైనే నిందలు వేశాడని, అతను అవినీతికి నిలువెత్తు రూపంగా మారారని ఆరోపించారు. విద్యార్థి తండ్రి ఆలీ మాట్లాడుతూ కుమారుడు చనిపోయినప్పుడు జరిగిన ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించారు. కుమారుడి మృతదేహాన్ని స్కూలు వద్దకు తీసుకొచ్చినప్పుడు ఎస్సై మహేంద్ర మాపై కేసులు పెడతామని బెదిరించి తరువాత ఇది హత్యే.. నేను కేసు నమోదు చేస్తానని మాయమాటలు చెప్పి తెల్లారి మాట మార్చి మాపైనే కేసులు పెడతామని బెదిరించారని ఆరోపించారు. అంతకు ముందు ఈశ్వరయ్య తన పార్టీ నాయకులతో కలిసి స్కూలును, ఘటనా స్థలాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. పార్టీ నాయకులు వీరారెడ్డి, ఆర్ వెంకటరావు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


