శాసీ్త్రయ ఆలోచనలను రేకెత్తించడమే జేవీవీ లక్ష్యం
ఒంగోలు టౌన్: ప్రజల్లో ముఖ్యంగా చిన్నారులు, విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక పనిచేస్తుందని జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ జయప్రకాష్ చెప్పారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం జేవీవీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకుడు ఏవీ పుల్లారావు పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ 1988వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ జేవీవీ ఆవిర్భవించిందని, మూఢనమ్మకాల నిరోధం, పర్యావరణ పరిరక్షణ, అందరికీ విద్య, నాణ్యమైన వైద్యం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆ సంస్థ రిసోర్స్‌పర్సన్ డి.వీరాంజనేయులు మాట్లాడుతూ చిన్నారుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిశోధనలు, సైన్స్ ప్రయోగాలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి యురేకా కాంపిటేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు పాఠశాలల యజమాన్యాలు, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఈనెల 8వ తేదీలోపు తమ ప్రయోగాల వీడియోలను ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేయాలని, పూర్తి వివరాలకు 85002 32432కు సంప్రదించాలని తెలిపారు.
మార్కాపురం: మెడికల్ మాఫియాను అరికట్టాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు అందె నాసరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మందులు, వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి ఎస్‌కే కాశిం, మాజీ కౌన్సిలర్ పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.


