కూటమితో విలపింఛన్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమితో విలపింఛన్‌

Mar 1 2026 7:39 AM | Updated on Mar 1 2026 7:39 AM

కూటమితో విలపింఛన్‌

కూటమితో విలపింఛన్‌

భర్త మరణించిన రెండేళ్లకు పింఛన్‌ ఎట్టకేలకు మంజూరైనా నగదు ఇచ్చేందుకు మోకాలడ్డుతున్న కూటమి నేతలు మూడు నెలల నుంచి పింఛన్‌ అందక విలపిస్తున్న వితంతువు

మర్రిపూడి: భర్త మరణించి ఆదరువు కోల్పోయిన భార్య వితంతు పింఛన్‌ కోసం రెండేళ్లుగా ఎదురు చూసింది. ఎట్టకేలకు పింఛన్‌ మంజూరైనా కూటమి నాయకులు కక్ష కట్టి ఆమెకు పార్టీలు అంటగట్టి పింఛన్‌ ఇవ్వకుండా అధికారులను కట్టడి చేశారు. దీంతో మూడు నెలల నుంచి పింఛన్‌ అందడం లేదని ఆమె విలపిస్తోంది. బాధితురాలి కథనం మేరకు.. మండల పరిధి మర్రిపూడి పంచాయతీలోని పొట్టిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చందల నర్సయ్య, అచ్చమ్మలు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. వీరికి ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికీ పెళ్లిళ్లు అయి వేరు కాపురం ఉంటున్నారు. అనారోగ్యంతో కుటుంబ పెద్ద అయిన నర్సయ్య (70) 2024 ఏప్రిల్‌ 15న మరణించాడు. అప్పటి నుంచి అచ్చమ్మ ఒంటరిగా ఉంటోంది. వితంతు పింఛన్‌ కోసం రెండేళ్ల పాటూ కార్యాలయాల చుట్టూ తిరిగింది. ఎట్టకేలకు పింఛన్‌ (పెన్షన్‌ ఐడీ: 108931649) మంజూరు చేయించుకుంది. అయితే దేవుడు కరుణించినా పూజారి మాత్రం కరుణించలేదన్న చందాన తయారైంది అచ్చమ్మ పరిస్థితి. ఆమెకు మంజూరైన పింఛన్‌కు కూటమి నాయకులు మోకాలడ్డుతున్నారు. ఈ విషయంపై 4 సార్లు కలెక్టర్‌ను సంప్రదించానని అచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 5 వ సారి జాయింట్‌ కలెక్టర్‌ ముందు గోడు వెళ్లబోసుకుంది. మర్రిపూడి ఎంపీడీఓ నాగూర్‌వలికి జేసీ ఫోన్‌చేసి మంజూరైన పింఛన్‌ను ఎందుకు ఆపుతున్నారని.. మీవద్ద నగదు ఉందికదా? ఆమె పింఛన్‌ సొమ్ము ఇచ్చి తనకు సమాచారం ఇవ్వాలని ఆదేశించినా అధికారులు ఇవ్వలేదని ఆమె విలపించింది. మంజూరైన మొదటి నెల పింఛన్‌ ఇవ్వకుండా రెండో నెలలో మొత్తం పింఛన్‌ సొమ్ము రూ.8 వేలు తీసుకుందువు వెళ్లిపో అన్నారు. రెండో నెలలో సచివాలయానికి వెళ్తే స్థానిక టీడీపీ నాయకులు, మంత్రి స్వామి, సత్య అందరూ పింఛన్‌ను ఆపమన్నారని కార్యదర్శి నాయుడు చెబుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

పంచాయతీ కార్యదర్శిని

నిలదీసిన వృద్ధురాలు

మంజూరైన మూడు నెలల పింఛన్‌ సొమ్ము ఇస్తారేమోనని వృద్ధురాలు చందల అచ్చమ్మ శనివారం స్థానిక సచివాలయానికి వెళ్లింది. పింఛన్‌ సొమ్ము ఇస్తావా లేదా? అని పంచాయతీ కార్యదర్శి నాయుడును నిలదీసింది. ఏం సమాధానం చెప్పలేక ఆయన మిన్నకుండిపోయాడు. అచ్చమ్మను చూసి కార్యదర్శి బయటకు వెళుతున్న తరుణంలో ఆమె పెద్ద కుమారుడు సుబ్బారెడ్డి సైతం పిలుస్తున్నా వినిపించుకోకుండా పలాయనం చిత్తగించాడు. పింఛన్‌ మంజూరైనా ఇవ్వకుండా నాయకులు అడ్డుకుంటున్నారని నా ఉసురు తగిలి కూటమి ప్రభుత్వ నాశనం అయిపోతుందని ఆమె శాపనార్థాలు పెట్టింది. ఈ విషయంపై ఎంపీడీఓ ఎస్‌కే నాగూర్‌వలి, పంచాయతీ కార్యదర్శి నాయుడును వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారి నుంచి స్పందన లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement