పేదకు రోగం.. పెద్ద ద్రోహం! | - | Sakshi
Sakshi News home page

పేదకు రోగం.. పెద్ద ద్రోహం!

Feb 25 2026 10:32 AM | Updated on Feb 25 2026 10:32 AM

పేదకు

పేదకు రోగం.. పెద్ద ద్రోహం!

మార్కాపురం:

ప్రజల ఆరోగ్యంతో చంద్రబాబు సర్కారు చెలగాటమాడుతోంది. పెద్దాసుపత్రులు పేదలకు అందుబాటులోకి వస్తే మెరుగైన సేవలు అంది, వారి ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఉద్దేశంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు చంద్రబాబు గద్దెనెక్కగానే గండికొట్టిన తీరు చర్చనీయాంశమైంది. ఎన్నికల వేళ ఎడా పెడా హామీలివ్వడం.. అధికారంలోకి రాగానే నాలుక మడతేయడాన్ని అలవాటుగా చేసుకున్న చంద్రబాబు.. ఈసారీ అదే పంథాలో అడుగులు వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని కొనసాగిస్తామని నమ్మబలికిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌.. పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చి వైద్య కళాశాలలకు ఉరి తాడు బిగించడంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పీపీపీకి వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా ఉద్యమానికి కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు బాహాటంగానే మద్దతుగా నిలవడం, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాల సేకరణలో పాల్గొనడం చంద్రబాబు సర్కారుకు కంఠగింపుగా మారిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాకు చెందిన 5.26 లక్షల మంది పీపీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మెడికల్‌ కాలేజీల వద్దకు టీడీపీ నేతలను పంపి వైఎస్సార్‌ సీపీ పాలనపై బురదజల్లే దుస్సాహసం చేసింది. సీఎం హోదాలో మార్కాపురంలో రెండోసారి పర్యటిస్తున్న చంద్రబాబు మార్కాపురం మెడికల్‌ కాలేజీ నిర్మాణంపై విస్పష్ట ప్రకటన చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

సేవలు అనుమానమే.. ఆర్థిక భారమే!

మార్కాపురం ప్రాంతంలో పేద గిరిజనులు, దళితులు, పలకల కార్మికులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు కూడా ఎక్కువే. రోజూ కూలీ పనులు చేసుకుంటేనే వీరి జీవనం సాగుతుంది. వైద్య పరంగా అత్యవసరమైతే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి ఆర్థిక భారం లేకుండా సేవలు పొందేందుకు వీలుంటుంది. పీపీపీ విధానంలో కాలేజీ, వైద్యశాల నిర్వహిస్తే రూ.లక్షల్లో ఫీజులు చెల్లించడం పేద వర్గాలకు తలకు మించిన భారమవుతుంది. ఈ విషయం సర్కారు పెద్దలకు తెలిసినా మొండిగా పీపీపీ విధానాన్ని అవలంబిస్తామని చెప్పడంపై పేద, మధ్య తరగతి ప్రజలు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా వైఎస్‌ జగన్‌ హయాంలో మార్కాపురం జిల్లా వైద్యశాలలో 75 మంది డాక్టర్లు సేవలు అందించగా, చంద్రబాబు ప్రభుత్వం రాగానే వైద్యులను భారీగా బదిలీ చేశారు. ఇప్పుడు వైద్యుల సంఖ్య 15కు చేరింది. 500 నుంచి 600 మధ్య ఉన్న ఓపీ ఒక్కసారిగా 300 దిగువకు పడిపోయింది. 2018 నాటి పరిస్థితులు పునరావృతం కావడంతో అత్యవసర వైద్యసేవల కోసం రోగులను ఒంగోలు, గుంటూరుకు రిఫర్‌ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

జీజీహెచ్‌ కూడా పీపీపీ విధానంలోకి..

మెడికల్‌ కళాశాలతోపాటు జీజీహెచ్‌ను కూడా పీపీపీ విధానంలోకి మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌ 2వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు దూరం చేసే ఈ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమర్జెన్సీ సర్వీసులు కావాలంటే ప్రాణాలను దేవుడిపై భారంవేసి ఒంగోలు లేదా గుంటూరుకు వెళ్లాలి. నాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే మెడికల్‌ కళాశాలకు సంబంధించి సిబ్బంది క్వార్టర్స్‌, నర్సింగ్‌ కళాశాల, జంట్స్‌, లేడీస్‌ హాస్టల్స్‌, సెంట్రల్‌ క్యాంటీన్‌ ఇలా అనేక భవన నిర్మాణ పనులను దాదాపు పూర్తి చేశారు. జీజీహెచ్‌లో 420 బెడ్లను సిద్ధం చేశారు. జనరల్‌ సర్జరీ కోసం 100, జనరల్‌ మెడిసిన్‌ 100, ఆర్ధోపెడిక్‌ విభాగానికి 40, ఆప్తమాలజీకి 20, డెర్మటాలజీ 10, సైక్రియాట్రి విభాగానికి 10, ఈఎన్‌టీకి 20, ఐసీయూకి 20, పీడియాట్రిక్స్‌ 50, గైనకాలజీకి 50 బెడ్లు కేటాయించారు. ఇప్పుడు ఇవన్నీ జీజీహెచ్‌లో కనిపించడం లేదు. గత ఏడాది నవంబర్‌ 5, 6 తేదీల్లో మెడికల్‌ కళాశాల ఆవరణలో ఉన్న సామగ్రిని, అత్యాధునికి వైద్య పరికరాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. దీంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా రోగులకు దూరమయ్యాయి. పేరుకు మాత్రమే జీజీహెచ్‌.. సేవల్లో మాత్రం పీహెచ్‌సీలా తయారైంది. ఇక దోర్నాలలో గిరిజనుల కోసం వైఎస్సార్‌ సీపీ హయాంలో నిర్మించ తలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలను వేగంగా పూర్తి చేయడంపై చంద్రబాబు సర్కారు మీన మేషాలు లెక్కిస్తోంది.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట.. అధికారంలో ఉంటే మరో మాట..

‘మారాను నమ్మండ’ని ఎన్నికల వేళ ప్రజల ఎదుట కొంగ జపం

గద్దెనెక్కాక మెడికల్‌ కాలేజీలపై సీఎం చంద్రబాబు, ఆయన తనయుడి ద్వంద్వ వైఖరి

పీపీపీ పేరుతో మార్కాపురం వైద్య కళాశాల పనులు అర్ధంతరంగా నిలిపివేత

వైద్య కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లాలో 5.26 లక్షల మంది సంతకాలు

అయినప్పటికీ తన పంథా మార్చుకోవడానికి ముఖ్య నేత ససేమిరా

నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మార్కాపురం మెడికల్‌ కాలేజీకి రూ.450 కోట్లు

70 శాతం మేర పనులు పూర్తయిన కాలేజీని పాడుబెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు

అప్పుడు సాధ్యం.. ఇప్పుడెలా అసాధ్యం?

మెడికల్‌ కాలేజీల నిర్మాణం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని సీఎం చంద్రబాబు, ఆయన వంధిమాగదులు చేస్తున్న ప్రకటనలపై మార్కాపురం జిల్లా వాసులు రగిలిపోతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మార్కాపురం ప్రాంత అభివృద్ధి, ఇక్కడి అవసరాల దృష్ట్యా నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్‌ కాలేజీ మంజూరు చేయడంతోపాటు రూ.450 కోట్ల నిధులు కేటాయించారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద 41.97 ఎకరాల స్థలంలో కాలేజీ నిర్మాణ పనులను శరవేగంగా పరుగులు తీయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికే 70 శాతం పనులు పూర్తి చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్‌ కాలేజీ పనులు అర్థంతరంగా నిలిచాయి. ప్రభుత్వానికి ఆర్థిక భారమంటూ సీఎం చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతూ పీపీపీ విధానాన్ని తెరమీదకు తేవడంతో.. వైఎస్‌ జగన్‌ పాలనలో లేని ఆర్థిక కష్టాలు ఇప్పుడెలా ఉత్పన్నమవుతున్నాయన్న సందేహం ప్రజల్లో వ్యక్తమైంది.

పేదకు రోగం.. పెద్ద ద్రోహం!1
1/1

పేదకు రోగం.. పెద్ద ద్రోహం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement